త్రిష కోసం నేను నిలబడతా.. మన్సూర్ అలీ ఖాన్‌కి చెంపచెల్లుమనిపించే కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్
స్టార్ హీరోయిన్ త్రిషపై `లియో` నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

`లియో` నటుడు మన్సూర్ అలీ ఖాన్.. హీరోయిన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. త్రిషని రేప్ చేసే అవకాశం రాలేదని, అందుకు చాలా బాధపడుతున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం దుమారం రేపింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మన్సూర్ అలీ ఖాన్‌ని అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. సెలబ్రిటీలు స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఆ వ్యాఖ్యలు కేవలం ఆర్టిస్ట్ కే మాత్రమే కాదు, ప్రతి మహిళకి కూడా అసభ్యంగా, చాలా అసహ్యంగా ఉన్నాయి. ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. వారు ఇలాంటి వక్రబుద్దితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంలో నేను త్రిష కోసం నిలబడా. కేవలం త్రిషకి మాత్రమే కాదు, ఇలాంటి అసభ్యకరమైన, భయంకరమైన వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి స్త్రీ వైపు నేను ఉంటాను` అని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు చిరంజీవి.
ఓ ఇంటర్వ్యూలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, `లియో` సినిమాలోని సన్నివేశాలను ప్రస్తావించారు. సినిమాలో త్రిషని రేప్ చేసే సీన్ ఉంటుందని భావించాను, కానీ ఆ సీన్ పెట్టలేదు. త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్ లో రేప్ సీన్ ఉంటుందని భావించా. చాలా చిత్రాల్లో నేను రేప్ సన్నివేశాల్లో నటించా. నాకేమి కొత్త కాదు. త్రిషని నా చేతులతో బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ ఈ చిత్రంలో నాకు త్రిషతో అసలు సన్నివేశాలే లేవు` అంటూ వెకిలి నవ్వుతో కామెంట్స్ చేశాడు. ఇవి దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
దీనిపై త్రిష స్పందించింది. ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తితో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నట్టు చెప్పింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉంటే చిరంజీవి, త్రిష కలిసి `స్టాలిన్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ జోడి రిపీట్ కాబోతుందని సమాచారం.