చిరంజీవి మాట్లాడుతూ, రీమేక్‌లు చేస్తే తప్పేంటి? అంటూ ఆయన తనపై వచ్చే విమర్శలకు కౌంటర్‌ సమాధానం ఇచ్చారు. మంచి కథలను చెప్పడంలో తప్పులేదని, ఎప్పుడైనా ఆడియెన్స్ ఆదరిస్తారని తెలిపారు

ఈ మధ్య రీమేక్‌ లు చేస్తే చాలా మంది విమర్శిస్తున్నారు. వరుసగా రీమేక్‌లు చేస్తున్నారని అంటున్నారు. మంచి సినిమాలను, మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను మన ఆడియెన్స్ కి చూపించడం కోసం రీమేక్‌లు చేస్తే ఏంటి? అనేది నాకు అర్థం కావడం లేదు. అందులో తప్పేంటి? అని ప్రశ్నించారు మెగాస్టార్‌ చిరంజీవి. అయితే `భోళాశంకర్‌` కథ వచ్చినప్పుడు తను కూడా `గాడ్‌ ఫాదర్‌` చేశాను, మళ్లీ రీమేక్ అంటే ఎలా అనే అనుమానం వ్యక్తం చేశానని, కానీ ఓటీటీలో అది లేదని, ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ సినిమాచేశానని తెలిపారు చిరంజీవి. 

ఆయన హీరోగా నటించిన `భోళాశంకర్‌` చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నేడు ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించగా, కీర్తిసురేష్‌ ఆయనకు చెల్లిగా నటించింది. ఇది తమిళంలో హిట్‌ అయిన `వేదాళం`కి రీమేక్‌. అనిల్‌ సుంకర నిర్మించారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా నేడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. 

ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, రీమేక్‌లు చేస్తే తప్పేంటి? అంటూ ఆయన తనపై వచ్చే విమర్శలకు కౌంటర్‌ సమాధానం ఇచ్చారు. మంచి కథలను చెప్పడంలో తప్పులేదని, ఎప్పుడైనా ఆడియెన్స్ ఆదరిస్తారని తెలిపారు. తాను ఏదైనా నచ్చే చేస్తానని తెలిపారు. అలానే `భోళాశంకర్‌` నచ్చి, ఇష్టపడి చేసిన సినిమా అని, రేపు ఆడియెన్స్ కి కూడా నచ్చే చిత్రమవుతుందన్నారు. 

మరోవైపు ఇక తన అభిమానుల గురించి చెబుతూ, అమ్మ ప్రేమ ఎప్పుడూ బోర్‌ కొట్టదని, ఎప్పుడూ ఫ్రెష్‌ ఫీలింగ్‌నిస్తుందని, అలాగే అభిమానుల ప్రేమ కూడా ఎప్పుడూ కొత్తగానే ఉంటుందని, వారి కేరింతలు, అరుపులు అదే రెట్టింపు ఎనర్జీనిస్తుందన్నారు. ఫ్యాన్స్ ఇచ్చే ఎనర్జీ కారణంగానే ఇప్పటికీ ఇంత అందంగా, ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటానని వెల్లడించారు చిరు. ఇంతటి అభిమానం చూస్తుంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందని, ఇంత మంది అభిమానులను ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు మెగాస్టార్. ఆడియెన్స్ ని చూసి, వారు పంచే ప్రేమని చూసి తాను మారుతూ వచ్చినట్టు చెప్పారు చిరు.

మరో సందర్భంలో అభిమానుల గురించి చిరు చెబుతూ, తాను నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మంచి పాత్రలు ఇచ్చేందుకు మేకర్స్ ఆలోచించేవాళ్లని, చిన్న చిన్న పాత్రలు చేయాలని అనేవారని, అలా `కొత్త అల్లుడు`, `కొత్తపేట రౌడీ` లాంటి సినిమాలు చేశానని చెప్పారు. అయితే అప్పట్లో తన సినిమాలకు, తన ఫైట్స్ డాన్సులకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోండటంతో కొందరు డిస్ట్రీబ్యూటర్లు చిరంజీవితో సినిమాలు చేయండి, వాటిని జనాలు బాగా చూస్తున్నారు, ఇష్టపడుతున్నారని చెప్పి తనతో సినిమాలు తీసేలా చేశారని వెల్లడించారు. అది ఆడియెన్స్ తనని ఆదరించడం వల్లే సాధ్యమైందని, అందుకే తనకు మొదటి ప్రయారిటీ ఫ్యాన్స్ అని, ఆ తర్వాతనే ఇండస్ట్రీ అని చెప్పారు. 

కొన్ని సినిమాలు చేస్తుంటే షూటింగ్‌ దశలో ఎక్కడో ఓ డౌట్‌ కొడుతుంటుంది, సినిమా ఎలా వస్తుందో, బాగా వస్తుందా? అనే అనుమానాలు కలుగుతాయి. కానీ ఈ సినిమా షూటింగ్ లో మాత్రం ప్రతి రోజూ ఉత్సాహంగా అనిపించేది, పాజిటివ్‌ ఎనర్జీ మాలో రన్‌ అయ్యేది. అలాంటి వాతావరణం దర్శకుడు మెహర్‌ రమేష్‌ కల్పించారు. దీంతోపాటు భారీ కాస్టింగ్‌, కమెడియన్లతో సినిమా చేస్తుంటే చాలా ఎనర్జీగా అనిపించేదన్నారు. 

దర్శకుడు మెహర్‌ రమేష్‌.. చిన్నప్పట్నుంచి తనని చూస్తూ పెరిగాడని, ఎంతో నేర్చుకున్నాడని, మేం తెలిసినంత మాత్రాన మా పేరు చెప్పి రాలేదు, తానేంటో నిరూపించుకున్నాడు, స్వయంకృషితో ఎదిగాడు, తన ప్రతిభతో ఈ స్థాయికి వచ్చాడు. ఎవరైనా స్వయంకృషితో రావాలి. ఇక్కడ టాలెంట్ ఉంటే రాణించగలుగుతారు. ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాడు. `బ్రో` ఈవెంట్‌ పవన్‌ చెప్పినట్టు ఇది మా ఫ్యామిలీ సొత్తు కాదు, మరెవరిదో కాదు, టాలెంట్‌ ఉన్న ప్రతి ఒక్కరిది, అందుకే ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు, ఆ విషయంలో తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు చిరు. పాత రక్తం పోయి, కొత్త రక్తం వస్తే మనలో ఎలాంటి ఎనర్జీ వస్తుందో, కొత్త టాలెంట్‌ వస్తే ఇండస్ట్రీలోనూ అలాంటి పవర్‌ వస్తుంది, అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు. అబ్బాయి, ఆడబిడ్డలు సహా ఎవరైనా రావచ్చు, అలాంటి ఆసక్తి కనబరిచిన వారిని ఫేరెంట్స్ కూడా ఎంకరేజ్‌ చేయాలన్నారు మెగాస్టార్. 

ఇందులో కీర్తిసురేష్‌ గురించి మాట్లాడుతూ, నవ్వులు పూయించారు చిరంజీవి. ఆమె చెల్లిగా బాగా చేసిందని, తమ మధ్య సెంటిమెంట్లు సీన్లు అద్భుతంగా వచ్చాయన్నారు. అయితే ఇంత అందమైన నటి తనని అన్నా అంటే తన పరిస్థితి ఏందని, తన పక్కన హీరోయిన్‌ గా చేయాల్సిన అమ్మాయి, అన్నా అంటే ఎక్కడో గుండెల్ని గుచ్చినట్టు ఉంటుందని, అందుకే మొదటి రోజే చెప్పాను, నన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ అన్నయ్య అనొద్దని, అదే మాటమీదుందన్నారు. అయితే తర్వాత సినిమాలో తనతో హీరోయిన్‌గా చేయాలంటూ చిరు చమత్కారాలకు నవ్వులు విరిసాయి. అలాగే శ్రీముఖి గురించి కూడా ఆయన సరదాగా చెప్పారు.