సినీ కార్మికులకు కరోనా వ్యాక్సిన్‌ వేయించే బాధ్యతలు తీసుకున్నారు చిరంజీవి. ఇప్పటికే ఓ దఫాగా 45ఏళ్లు పైబడిన వారికి మొదటి డోస్‌ వేయించగా. ఇప్పుడు మరోసారి 18ఏళ్లు పై బడిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేయించే కార్యక్రమం చేపట్టారు. అపోలో ఆసుపత్రి సహకారంతో చిరంజీవి ట్రస్ట్, కరోనా క్రైసిస్‌ ఛారిటీ సమక్షంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. 

తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల వర్కర్లకి, అలాగే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ సభ్యులు, ఫిల్మ్ జర్నలిస్ట్ లకు కూడా ఇందులో వ్యాక్సిన్‌ వేయించబోతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఇందులో దర్శకుడు ఎన్‌.శంకర్‌, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. అర్హులంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు చిరు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ` కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. అలాగే జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. 

ఈ రోజు ఈ సిసిసి తలపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో 24 / 7ల సహకారంతో ఈ వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం అయింది. ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంతమంది ఉంటె .. అందరికి వాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ సందర్బంగా అపోలో వారికీ నా అభినందనలు తెలుపుతున్నా.  అలాగే ఈ కార్యక్రమంలో తప్పకుండా సినిమా కార్మికులు అందరు  పాల్గొనేలా మోటివేట్ చేసిన భరద్వాజ గారికి, ఎన్ శంకర్ , ఫెడరేషన్ ప్రసిడెంట్ అనిల్ గారికి, సెక్రెటరీ దొరై గార్లకు అభినందనలు తెలియచేస్తున్నాను. తప్పకుండా సినీ కార్మికులందరూ వాక్సిన్ తీసుకోవాలి.

కరోనా లాక్ డౌన్ సమయంలో గత ఏడాది ఏర్పాటు చేసిన  సీసీ చారిటి విషయంలో భరద్వాజ గారు, ఎన్ . శంకర్, మెహర్ రమేష్, కె ఎల్ ధాముగారు, సి కళ్యాణ్ గారు, బెనర్జీ, సురేష్ ఇలా అందరు దీనికి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి సీసీసీ ఆధ్వర్యంలో గత ఏడాది సినిమా కార్మికులకు మూడు సార్లు నిత్యావసర సరుకులు అందచేశాం. సినీ కార్మికులందరిని ఒకే  వేదికపైకి తెచ్చి సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాం. సీసీసీ చారిటి మొదలెట్టినప్పుడు అందరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చారు దానికి తగ్గట్టుగా సీసీసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పైసా కూడా అవసరం ఉన్నవాళ్లకు చేరేలా చర్యలు తీసుకుంటాం.. దానికి నేను భరోసా.  అలాగే తప్పకుండా 18 ఏళ్ళు నిండిన వారంతా వాక్సిన్ తీసుకోవాలి. తప్పకుండా అందరు వాక్సిన్ తీసుకుని కరోనా రాకుండా  చేద్దాం'  అన్నారు.