దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలుగు సినిమాకి కమర్షియల్‌ హంగులద్దిన దర్శకుడు. హీరోయిన్లని ఎంత అందంగా చూపించొచ్చో పరిచయం చేసిన దర్శకుడు. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని పీక్‌లోకి తీసుకెళ్లిన దర్శకుడు. ఫైట్స్ కి కొత్త లుక్‌ని అద్దిన దర్శకుడు. ఇంకా చెప్పాలంటే రాఘవేంద్రరావు తెలుగు సినిమా కమర్షియల్‌ ట్రెండ్‌ సెట్టర్‌. రొమాంటిక్‌ చిత్రాలు, యాక్షన్‌ సినిమాలు, భక్తిరస చిత్రాలను ఇలా అన్ని రకాల సినిమాలు రూపొందించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్‌ గుర్తింపుని దక్కించుకున్నారు. దర్శకేంద్రుడుగా నిలిచారు.

 నేడు(మే 23) కె.రాఘవేంద్రరావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా స్టార్‌ చిరంజీవి బర్త్ డే విషెస్‌ తెలిపారు. తనకు కమర్షయల్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడంటూ ప్రశంసలు కురిపించారు. `రాఘవేంద్రరావు సినీప్రస్థానంలో అత్యధిక చిత్రాల కథానాయకుడిగా నాకు ఓ ప్రత్యేకత లభించింది. ఆ రకంగా మా కాంబినేషన్‌ ఎంతో స్పెషల్‌. నా స్టార్‌డమ్‌ను, కమర్షియల్‌ స్థాయిని పెంచాడీ దర్శకుడు. తెలుగు చిత్రాల్లో ఎప్పటికీ అపురూపంగా నిలిచే `జగదేకవీరుడు అతిలోక సుందరి` లాంటి చిత్రాన్ని నాకు కానుకగా ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా` అంటూ చిరు ట్వీట్‌ చేశారు. 

వీరి కాంబినేషన్‌లో `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `ఘరానా మొగుడు`, `రౌడీ అల్లుడు`, `అడవి దొంగ`, `ముగ్గురు మొనగాళ్లు`, `శ్రీమంజునాథ`, `కొండవీటి రాజా`, `మంచి దొంగ` వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలొచ్చాయి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకుడు సినిమాలకు దూరంగా  ఉంటున్నారు. ఇప్పుడు తన దర్శకత్వ పర్యవేక్షణలో `పెళ్లిసందd`సినిమాని రూపొందిస్తున్నారు.