Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు.. సంచలనం రేపుతున్న చిరంజీవి ట్వీట్

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

chiranjeevi share audio clip says Politics is not far from me
Author
First Published Sep 20, 2022, 1:45 PM IST

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఆడియో క్లిప్‌లో.. ‘‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’’ అని పేర్కొన్నారు. అయితే ఈ డైలాగ్ తన తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌కు సంబంధించింగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి నోటి వెంట ఈ విధమైన డైలాగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డైలాగ్‌కు సంబంధించిన ఆడియోను పోస్టు చేసిన చిరంజీవి.. గాడ్ ఫాదర్‌ చిత్రంలో తన లుక్‌ను మాత్రమే పోస్టర్‌లో ఉంచారు. ఇక, చిత్రానికి సంబంధించిన ఎలాంటి వివరాలను గానీ, ఏ విధమైన సందేశాన్ని కూడా అటాచ్ చేయలేదు.

దీంతో ఆయన రాజకీయ ఎంట్రీపై మరోసారి అభిమానుల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను మెగా అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో భాగమేనని ఫిల్మ్ నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. 

 

గతంలో ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఏపీ పునర్విభజన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో కనిపించారు. అయితే చాలా కాలంగా ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే పలుమార్లు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వార్తలు వచ్చాయి.  కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సమయంలో కూడా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగింది. 

చిరంజీవి రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే ఆ వార్తలను చిరంజీవి ఖండించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటునానని చెప్పారు. తాను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు  రావటం జరగదని పేర్కొన్నారు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దని కోరారు. అయితే చిరంజీవి ప్రస్తుతం చేసిన ట్వీట్‌ను అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios