చిరంజీవి ఫోటో, పేరు, ఆయనకి సంబంధించిన అంశాలని వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవ్వరూ వాడకూడదని ఇటీవల కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని మెగాస్టార్ లీగల్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
చిరంజీవి పేరు, ఫోటోలు వాడకూడదు
వాణిజ్య ప్రయోజనాల కోసం, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయనకు సంబంధించిన ఫోటోలు, పేరుని వాడకూడదని ఇటీవల కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి లీగల్ టీమ్ అధికారికంగా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు కమర్షియల్ గా చిరంజీవి పేరుని, ఆయన ఫోటోలు, గొంతు, మ్యానరిజమ్స్ ని చాలా మంది వాడుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థానానికి ఎదిగి.. జాతీయ స్థాయిలో పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న చిరంజీవి గౌరవాన్ని కాపాడేందుకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన లీగల్ టీమ్ పేర్కొంది.
నలభై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో మెగాస్టార్
నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలందుకున్న చిరంజీవి గారు, తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేందుకు కోర్టు జోక్యం కోరారు.
భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా, ఉన్నత వ్యక్తిత్వంగా చిరంజీవి గారి స్థానాన్ని గుర్తిస్తూ, పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేని విక్రయాలు మొదలైన చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించింది. ముఖ్యంగా డిజిటల్, AI వేదికల ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతిరూపణ వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది.

కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
దీనితో చిరంజీవికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, గొంతు, మ్యానరిజమ్స్ అలాగే సినిమా రంగంలో ఆయనకు ఉన్న మెగాస్టార్, చిరు, అన్నయ్య లాంటి బిరుదులని కూడా వాణిజ్య పరంగా, ఆయన ప్రతిష్టని దిగజార్చే విధంగా వాడుకోవడాని కోర్టు నిషేధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎవరైనా చిరంజీవి గారి ఫోటోలు, ఏఐ దృశ్యాలు లాంటివి వాడితే కఠిన చర్యలు ఉంటాయని లీగల్ టీమ్ స్పష్టం చేసింది.
కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు వచ్చేలా అమూల్యమైన కృషి చేసిన ఎస్. నాగేశ్ రెడ్డి, అడ్వకేట్‌కి, వారి న్యాయ బృందానికి చిరంజీవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
