గద్దర్ మరణం.. ‘ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’.. ఆర్ నారాయణ మూర్తి, చిరంజీవి, బాలకృష్ణ, తారక్ నివాళి
ప్రజా యుద్ధనౌక గద్ధర్ కొద్దిసేపటి కింద మరణించారు. ఆయన మరణం పట్ల పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి చింతించారు. ప్రజా గొంతుక మూగబోవడంతో చిరంజీవి, బాలకృష్ణ సైతం నివాళి అర్పించారు.
దశబ్దాల పాటుగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం గద్దర్ పోరాడుతున్నారు. వందల పాటలు పాడి ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేశారు. గత కొద్దిరోజులుగా ప్రజా యుద్దనౌక, గాయకుడు గద్దరన్న (Gaddar) అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు అమీర్ పేట్ లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. శోకసంద్రంలో మునిగిపోయారు.
గద్దర్ మరణవార్తను ప్రజా గాయకులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) కూడా నివాళి అర్పించారు. గద్దర్ మరణం పట్ల చింతించారు. తిరిగి రాని లోకాలు వెళ్లడంతో విచారం వ్యక్తం చేశారు.
ప్రజా గాయకుడు మరణం పట్ల నారాయణ మూర్తి స్పందిస్తూ.. ఒక అన్నమయ్య పుట్టారు..దివంగతులయ్యారు, ఒక రామదాసు పుట్టారు...దివంగతులయ్యారు, ఒక పాల్ రబ్సన్ పుట్టారు...దివంగతులయ్యారు.. ఒక గద్దర్ పుట్టారు...దివంగతు లయ్యారంటూ నివాళి అర్పించారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసిందని పేర్కొన్నారు. మరోవైపు గద్దర్ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికన నివాళులు అర్పిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం గద్దర్ మరణ వార్తకు చింతించారు. ట్వీటర్ వేదికన సంతాపం ప్రకటించారు... వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం ! సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యం లో, ప్రజా ఉద్యమాల లో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా సంతాపం ప్రకటించారు. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. ‘తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తాజాగా నివాళి అర్పించారు. ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అంటూ ట్వీటర్ వేదికన సంతాపం ప్రకటించారు.