తమ్ముడు, పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రాన్ని వీక్షించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన శుక్రవారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి ఏఎంబీ మల్టీఫ్లెక్స్ లో సినిమాని తిలకించారు. ఇందులో చిరుసతీమణి, వాళ్ల అమ్మగారు అంజనాదేవి, నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్‌ తేజ్‌,సాయిధరమ్‌ తేజ్‌ తదితర ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సినిమాని వీక్షిస్తున్నట్టు చిరు ట్వీట్‌ చేశారు. తాజాగా ఆయన సినిమాపై ట్వీట్‌ చేసి ప్రశంసలు కురిపించారు. తమ్ముడు పవన్‌, ప్రకాష్‌ రాజ్‌, అంజలి, నివేదా, అనన్య, దర్శకుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్‌లను అభినందించారు. 

`కోర్ట్ రూమ్‌ డ్రామ్‌లో పవన్‌ కళ్యాణ్‌ టెర్రిఫిక్‌ నటనని ప్రదర్శించాడు. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్‌ కళ్యాణ్‌లో అదే వేడి, అదే వాడి,  అదే పవర్‌. ప్రకాష్‌ రాజ్‌తో కోర్ట్ రూమ్‌ డ్రామా అద్భుతం. నివేదా థామస్‌, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. సంగీత దర్శకుడు థమన్‌, డీఓపీ వినోద్‌ ప్రాణం పోశారు. నిర్మాత దిల్‌రాజ్‌కి, బోనీ కపూర్‌కి, దర్శకుడు వేణు శ్రీరామ్‌కి, మిగతా టీమ్‌కి నా శుభాకాంక్షలు. అన్నిటికి మించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రమిది. ఈ `వకీల్‌సాబ్‌` కేసులనే కాదు, అందరి మనసుల్ని గెలుస్తాడు` అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 

మూడేళ్ల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం `వకీల్‌సాబ్‌`. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించగా, బోనీ కపూర్‌ సమర్పణలో, దిల్‌రాజు ఈ సినిమాని నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు తిరగరాయబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఏమేరకు సంచలనాలు సృష్టిస్తుందో మరో రెండు రోజుల్లో తేలనుంది.