కన్నడ స్టార్ హీరో సుదీప్ ని అరెస్ట్ చేయాలని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాఫీ ఎస్టేట్ వివాదంలో సుదీప్ కోర్టుకి హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన చిక్ మంగళూరు న్యాయస్థానం సుదీప్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

మే 22వ తేదీలోపు సుదీప్ ఆచూకి తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్ కోసం దీపక్ పటేల్ అనే వ్యక్తికి చెందిన కాఫీ ఎస్టేట్ ను సుదీప్ అద్దెకు తీసుకున్నారు.

దీనికోసం రూ.80 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా యాభై వేలు ఇచ్చి మిగిలిన డబ్బును చెల్లించలేదట. దీంతో దీపక్.. సుదీప్, సుదీప్ కి చెందిన ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్ మహేష్ లపై కేసు నమోదు చేశారు.

తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా, కాఫీ తోటల్ని, కొంత ఆస్తిని నాశనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ కేసులో సుదీప్ తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు.