హర్రర్ కామెడీ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ `చంద్రముఖి`కి సీక్వెల్ వస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక కలిసి నటించిన `చంద్రముఖి` చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా హర్రర్ కామెడీ చిత్రాలకు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో హర్రర్ సినిమాలకు పునాది వేసింది. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇన్నాళ్లకు ఈ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించారు యూనిట్. గతంలో లారెన్స్ `చంద్రముఖి 2` చేస్తున్నట్టు ప్రకటించారు. రజనీకాంత్ అనుమతి తీసుకున్నానని, ఆయన బ్లెస్సింగ్స్ తో ఈ చిత్రం చేయబోతున్నట్టు వెల్లడించారు.
ఇప్పటి వరకు దాని అప్‌డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. `చంద్రముఖి 2` పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుండటం విశేషం. రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా, వడివేలు కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి చిత్రాన్ని రూపొందించిన పి వాసునే సీక్వెల్‌ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. ఆర్‌డీ రాజశేఖర్ కెమెరామేన్‌గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్ వర్క్‌ను చూసుకోనున్నారు.
హర్రర్ కామెడీ చిత్రాలు చేయడంలో లారెన్స్ దిట. `కాంచన` సిరీస్‌లతో వరుస విజయాలను అందుకున్నారు. హిందీలోనూ సక్సెస్ కొట్టారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌తో మరో విజయాన్ని అందుకోబోతున్నారని చెప్పొచ్చు. అయితే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది యూనిట్. ఇందులో హీరోయిన్లు ఎవరు నటిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు.
