ఏపీ ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ తరఫున సినీ తారలు జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన పార్టీల సంగతేమో గానీ జగన్ పార్టీకి సినీ గ్లామర్ అదనపు ఆకర్షణగా మారింది. వైఎస్సార్ సీపీలో చేరడానికి సెలబ్రిటీలు సైతం క్యూ కట్టారు.

సీటు దక్కుతుందనే నమ్మకం లేకపోయినా.. ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి, పృధ్వీ వంటి వారు పార్టీ గెలుపు కోసం శ్రమించారు. పవన్ కళ్యాణ్ స్నేహితుడైన అలీ సైతం జగన్ పార్టీలోకి జంప్ అయ్యి మద్దతుగా నిలిచారు. జీవితా రాజశేఖర్ లు కూడా వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. 

చిన్న కృష్ణ లాంటి వాళ్లు సైతం పార్టీలో చేరడంతో సినిమా వాళ్లకు జగన్ పార్టీ అడ్డాగా మారిపోయింది. ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు. మన సెలబ్రిటీలు ఆశించినట్లుగానే వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు మన సెలబ్రిటీలు.. ఎమ్మెల్యే సీటు దక్కలేదు కాబట్టి కనీసం నామినేటెడ్ పదవులన్నా దక్కుతాయని ఆశిస్తున్నారు.

జగన్ నుండి కచ్చితంగా పిలుపు వస్తుందని కలలు కంటున్నారు. పృధ్వీ, పోసాని వంటి వారికి నమ్మకాలు మరింత బలంగా ఉన్నాయి. జగన్ పార్టీ పెద్దలతో ఈ నటులిద్దరూ టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా సీట్ దక్కించుకోవాలని కొందరు సెలబ్రిటీలు భావిస్తున్నారు. మరి జగన్ సినిమా వాళ్లను కరుణిస్తాడో లేదో చూడాలి!