గతంలో ప్రముఖ నటుడు అర్జున్ పై నటి శృతి హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ తనను వేధించాడని ఆమె సంచలన కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సీన్లలో నటించే సమయంలో తనను చిత్రహింసలు పెట్టాడని, దర్శకుడితో కలిసి అసభ్య వ్యాఖ్యలు చేశాడని ఆరోపించింది.

అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. విషయం పెద్దది కావడంతో కన్నడ చిత్రపరిశ్రమ ప్రముఖులు జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ శృతి దానికి అంగీకరించలేదు. అర్జున్ పై తను చేసిన ఫిర్యాదులపై పోరాడనున్నట్లు వెల్లడించింది.

ఈ కేసుల కారణంగా అర్జున్ పోలీస్ స్టేషన్ కు కూడా హాజరవుతూ వస్తున్నాడు. మరోవైపు శ్రుతిపై కూడా కేసులు నమోదయ్యాయి. అర్జున్ కుటుంబసభ్యులు శ్రుతిపై కేసులు నమోదు చేశారు. తమ తండ్రి పరువుకు భంగం కలిగిస్తోందని అర్జున్ పిల్లలు శృతిపై కేసులు పెట్టారు. ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు.

దానికి సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉంది. అయితే తనపై అనవసరంగా కేసులు పెట్టారని.. ఆ కేసులు చెల్లవని శృతి మరోసారి కోర్టుకి వెళ్లింది. అయితే కేసును కొట్టేయాలని శ్రుతి పెట్టిన పిటిషన్ ని కోర్టు కొట్టిపారేసింది. కేసు కొనసాగుతుందని కోర్టు వెల్లడించింది.