అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది బాత్ టబ్ లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెది అసహజ మరణమని.. కుట్ర చేసి చంపేశారంటూ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి ఏడాది దాటినా.. ఇప్పటికీ సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీదేవిది హత్యేనని.. ఆమె మరణంలో కుట్రకోణం దాగి ఉందంటూ కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు.

ఆమె బాత్ టబ్ లో మునిగి చనిపోయి ఉండకపోవచ్చనే సందేహాలను వ్యక్తం చేశారు. ఓ పేపర్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్ తనతో పంచుకున్నారని చెప్పాడు.

ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా.. అడుగు లోతు ఉండే బాత్ టబ్ లో పడి చనిపోవడం జరగదని.. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తి పట్టి.. తలను నీటిలో ముంచి ఉంటారని.. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే ఛాన్స్ లేదని అన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయి ఉండకపోవచ్చని, హత్య అయి ఉండవచ్చని డాక్టర్ ఉమాదత్తన్ తనతో అన్నట్లు ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని బోనీకపూర్ వద్ద ప్రస్తావించగా.. ఆయన ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటివి వస్తూనే ఉంటాయని.. ఎటువంటి ఆధారాలు లేని ఊహాజనిత వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి మూర్ఖ వాదనలను ఎవరో ఒకరు పుట్టిస్తూనే ఉంటారని అన్నారు.