Asianet News TeluguAsianet News Telugu

నేను పండితుల కుటుంబం నుండి రాలేదు..బోనం ఎత్తనివారు, గుడికి పోనివారు మాట్లాడుతున్నారా,  మంగ్లీ ఫైర్

సోషల్ మీడియా వేదికగా మంగ్లీ జాతి, కులం, మతంపై కూడా అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో ఆమె సుదీర్ఘ వివరణ ఇచ్చారు. భక్తి సాహిత్యం, ఆచారాలను ఆధారాలుగా చూపిస్తూ విమర్శకులకు వివరణతో పాటు, విమర్శించే ప్రయత్నం కూడా చేశారు. మంగ్లీ సోషల్ మీడియా పోస్ట్ ఈ విధంగా సాగింది.. 
 

bonalu song controversy finally mangli came up with an emotional note ksr
Author
Hyderabad, First Published Jul 21, 2021, 2:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గత వారం రోజులుగా మంగ్లీ బోనాల సాంగ్ సోషల్ మీడియాలో చర్చగా మారింది. ''చెట్టు క్రింద కుర్చున్నావమ్మా చుట్టం లెక్కా ఓ మైసమ్మా..' సాంగ్ లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శించేవిగా ఉన్నాయని కొందరు మంగ్లీ పాటను తప్పుబట్టారు. బీజేపీ కార్పొరేటర్లు మంగ్లీపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా మంగ్లీ జాతి, కులం, మతంపై కూడా అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో ఆమె సుదీర్ఘ వివరణ ఇచ్చారు. భక్తి సాహిత్యం, ఆచారాలను ఆధారాలుగా చూపిస్తూ విమర్శకులకు వివరణతో పాటు, విమర్శించే ప్రయత్నం కూడా చేశారు. మంగ్లీ సోషల్ మీడియా పోస్ట్ ఈ విధంగా సాగింది.. 

రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం.. 'చెట్టుకింద కూసున్నవమ్మ' పాటలో మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన, నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు, పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాం. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల్ల కొలువులు ఇలా రకరకాల ఆచారాలున్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాం.

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్‌, శీతలా(సాతి భవాని) పండగల్లో ప్రకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకునేది గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. నేను సింగర్‌గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వల్లే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో మా తాతలనాటి ఆంజనేయ స్వామి విగ్రహానికి గుడి కట్టించి పూజలు చేస్తున్నాము.

ఏనాడూ గుడికి వెళ్లనివాళ్లు, బోనం ఎత్తని వాళ్లు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో గమనించాలి. గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా లాల్‌ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నాను. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు.. ఏ పండగ వచ్చినా నేను పాటలు చేస్తున్నాను. ఈసారికి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్లి మరీ చిత్రీకరించాము. ప్రతి పండగలో నా పాటల ద్వారా మీ ఇంటి భాగస్వామినయ్యాను. మీ ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులో పెట్టుకున్నారు. ఇందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఒక్కరోజులో ఫేమస్‌ కాలేదు. నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉంది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారు.

గ్రామదేవతలను ఎలా కొలుస్తారు? మైసమ్మ కొలువు పాటలు, నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకుని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేది. ఈ పోస్టు నా మనసుకు బాధ కలిగించినవారి కోసం, నన్ను అభిమానించేవారి మనసుకు కష్టం కలిగించిన వారి కోసం. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజే పాట మార్చే అవకాశం ఉన్నప్పటికీ పాట కోసం ప్రాణం పెట్టిన వృద్ధ రచయిత రామస్వామి గారిని తక్కువ చేయొద్దనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ను కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్‌లో మార్పులు చేశాం. నన్ను వ్యతిరేకించినవారు, నిందించినవారు అందరూ నా వాళ్లే అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను" అని మంగ్లీ చెప్పుకొచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios