బాంబ్‌ బెదిరింపులు ముంబయి నగరాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ముఖ్యంగా అమితాబ్‌ ఇంటికి బాంబ్‌ బెదిరింపులు కలవరానికి గురి చేస్తున్నాయి. 

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కి బాంబ్‌ బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అమితాబ్‌ బచ్చన్‌ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని అగంతకులు బెదిరించారు. దీంతోపాటు ముంబై నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లని పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు నిర్వహించిన సెర్చింగ్‌ ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా ఏ వస్తువు లభ్యం కాలేదని ముంబయి పోలీసులు తెలిపారు. 

ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం రాత్రి కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఆగంతకుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లతోపాటు.. జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు ఉంచినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. బెదిరింపు ఫోన్ అనంతరం.. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు, స్థానిక పోలీసు సిబ్బందితో పాటు రైల్వే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయా ప్రదేశాలకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని పోలీసు కమిషనర్ వెల్లడించారు. 

Scroll to load tweet…

కానీ అనుమానాస్పదంగా ఏదీ కనుగొనలేదని, కానీ ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. కాగా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాంబ్‌ బెదిరింపు కాల్స్ తో ముంబయి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.