ప్రముఖ క్రికెటర్, విధ్వంసకర వీరుడు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అనేక సందర్భాల్లో యువి ఒంటిచేత్తో జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా వన్డేలు, టి20లలో అతడు ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నం. అలాంటి క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో సినీ తారలు వరుసగా స్పందిస్తున్నారు. యువరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్ కు అందించిన సేవలని కొనియాడుతున్నారు. 

థాంక్యూ యువరాజ్ సింగ్.. నీవందించిన మధుర జ్ఞాపకాలు ఎప్పటికి మరచిపోలేనివి అని బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ పై ఆసక్తికరంగా స్పందించింది. యువి.. నీవు మా హృదయం బద్దలయ్యే నిర్ణయం తీసుకున్నావు. అద్భుతమైన ఆటతో మాకు వినోదాన్ని అందించావు. దేశం నిన్ను చూసి గర్విస్తోంది. భరత మాత ముద్దుబిడ్డ నీవు. నీవు కొట్టిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లని ఎప్పటికి మరిచిపోలేం.. నీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ అని రవీనా టాండన్ ట్వీట్ చేసింది. 

నేహా దుపియా మాట్లాడుతూ.. యువరాజ్ సింగ్ ఆట నుంచి దూరమవుతున్నాడు.. హృదయాల నుంచి కాదు. మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని నేను ప్రశ్నించిన ప్రతిసారి అందులో తప్పనిసరిగా యువరాజ్ సింగ్ అనే సమాధానం వస్తుంది. అది ఎప్పటికి మారదు అంటూ నేహా ధూపియాతో కలసి ఉన్న యువరాజ్ ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేసింది. 

ఇక యువరాజ్ సింగ్ బెస్ట్ ఫ్రెండ్, నటుడు అంగద్ బేడీ స్పందించాడు. ఇండియాకు నీవందించిన సేవలకు థాంక్యూ యువరాజ్. యువరాజ్ నిజమైన ఛాంపియన్. ప్రతి సందర్భంలో తనని తాను మార్చుకున్నాడు. జెర్సీ నెంబర్ 12 అనే హ్యాష్ ట్యాగ్ జతచేస్తూ అంగద్ బేడీ ట్వీట్ చేశాడు.