బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం నుంచి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవల సుశాంత్‌కు వీడ్కోలు పలుకుతూ ఓ నోట్‌ను రిలీజ్ చేసిన కుటుంబ సభ్యులు సుశాంత్ పేరిట ఫౌండేషన్‌ ఏర్పాటు చేయటంతో పాటు సుశాంత్ వినియోగించిన వస్తువులతో మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇప్పుడిప్పుడే వారు బాధ నుంచి కాస్త తేరుకుంటుండటంతో సినీ ప్రముఖులు సుశాంత్ తండ్రిని పరామర్శిస్తున్నారు. ప్రముఖ నటుడు, టెలివిజన్‌ హోస్ట్‌ శేఖర్‌ సుమన్‌, సుశాంత్ కుటుంబాన్ని పరామర్శించినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేశాడు. గతంలో సుశాంత్ మృతిపై స్పందించిన శేఖర్‌ సుమన్‌, ఇలా జరుగుతుందని ఊహించాను అంటూ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ యాక్టర్‌ నానా పటేకర్ కూడా సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ కుటుంబాన్ని పరామర్శించాడు. శుక్రవారం పాట్నాలోని సుశాంత్‌ ఇంటికి వెళ్లిన ఆయన సుశాంత్ తండ్రిని కలిసి ఓదార్చారు. సుశాంత్ కుటుంబాన్ని కలిసి తరువాత మీడియాతో మాట్లాడేందుకు నానాపటేకర్ నిరాకరించారు.