కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన `బింబిసార` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో అభిమాని మరణించిన నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది.

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన `బింబిసార` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అభిమాని కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్‌కి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో పుట్టా సాయిరామ్‌ అనే అభిమాని కన్నుమూశారు. పిట్స్ వచ్చిన కారణంగా సాయిరామ్‌ పడిపోయాడని, వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తుంది. 

వెస్ట్ గోదావరి జిల్లా, పెంటపాడు మండలానికి చెందిన అభిమాని పుట్టా సాయిరామ్‌(సన్నాఫ్‌ రాంబాబు) మృతి పట్ల `బింబిసార` యూనిట్‌ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈవెంట్‌లో దురదృష్ణవశాత్తు అభిమాని మరణించాడనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపింది. పుట్టా సాయిరామ్‌ లేదనేది నిజంగా గుండెపడిలే వార్త. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామని, సాయిరామ్‌ కుటుంబాన్ని సాధ్యమైన విధంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

తాడెపల్లిగూడెంకి చెందిన సాయిరామ్‌.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారట. తన కుటుంబానికి అతనే పెద్ద దిక్కుగా ఉన్నారని, ఆయనపైనే ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సాయిరామ్‌ మృతి పట్ల వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. సాయిరామ్‌ ఎన్టీఆర్‌కి వీరాభిమాని అని తెలుస్తుంది. అయితే ఆయన మృతి పట్ల పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారని సమాచారం. 

Scroll to load tweet…

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన `బింబిసార` చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై హరి నిర్మిస్తున్నారు. కేథరిన్‌ థ్రెసా, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటించారు. ఆగస్ట్ 5న ఈ సినిమా విడుదల కానుంది. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో నిర్వహించారు. ఎన్టీఆర్‌ దీనికి గెస్ట్ గా హాజరయ్యారు.