పాపులర్ టెలివిజన్ షో బిగ్ బాస్ సౌత్ కి పాకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్ కి రెడీ అవుతోంది. దీనికోసం కంటెస్టంట్ లను వెతికే పనిలో పడ్డారు నిర్వాహకులు. ఈసారి పాపులర్ సెలబ్రిటీలను షోలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఇందులో భాగంగా యాంకర్ శ్రీముఖిని రంగంలోకి దింపినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే ఆమె 'పటాస్' షోకి బ్రేక్ ఇచ్చిందని అంటున్నారు. ఇక శ్రీముఖితో పాటు మరో రెండు పేర్లు బలంగా  వినిపిస్తున్నాయి. అందులో ఒకరు బాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా.. 

ప్రస్తుతం బాడ్మింటన్ నుండి రిటైర్ అయిన ఈమె అప్పుడప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో నితిన్ నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది జ్వాలా. ఈమెని షోలో తీసుకుంటే ఆడియన్స్ మరింత ఎంటర్టైన్ చేస్తుందని భావిస్తున్నారు. 

ఇక మరో కంటెస్టంట్ ఎవరంటే.. వైవా హర్ష.. యూట్యూబ్ లో తన వీడియోలతో సూపర్ పాపులర్ అయిన హర్షని ఇప్పుడు బిగ్ బాస్ షో కోసం సంప్రదిస్తున్నారట. ఈ ముగ్గురు షోలో కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. 

హోస్ట్ విషయానికొస్తే.. సీజన్ 1ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2ని నాని హోస్ట్ చేశారు. ఇప్పుడు సీజన్ 3 కోసం నాగార్జునని సంప్రదిస్తున్నారు. దాదాపు ఆయనే ఖాయమైనట్లు తెలుస్తోంది.