బిగ్ బాస్ (Bigg Boss) టైటిల్ విన్నర్స్ ని వెంటాడుతున్న సెంటిమెంట్ ని సన్నీ బ్రేక్ చేశారు. హౌస్ నుండి బయటికి వచ్చిన నెలల వ్యవధిలో కొత్త సినిమాను విడుదలకు సిద్ధం చేసి సత్తా చాటాడు. ఆ నలుగురితో పోల్చితే బెటర్ అనిపిస్తున్నాడు.

సెంటిమెంట్ మూఢనమ్మకం అయినప్పటికీ క్రమం తప్పకుండా జరుగుతుంటే నమ్మాలనిపిస్తుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ ని ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. విన్నర్ గా భారీ ఫేమ్, పాపులారిటీ తెచ్చుకుంటున్న కంటెస్టెంట్స్ కెరీర్ దుర్భరంగా మారుతుంది. గతంలో కాస్తా కూస్తో పర్వాలేదన్నట్లున్న వారి కెరీర్లు షో తర్వాత మూలనపడుతున్నాయి. గత నాలుగు సీజన్స్ బిగ్ బాస్ విన్నర్స్ కెరీర్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. 

2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్ టైటిల్ విన్నర్ గా శివ బాలాజీ నిలిచారు. తర్వాత కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ వరుసగా టైటిల్ అందుకున్నారు. ఇక లేటెస్ట్ సీజన్ బిగ్ బాస్ 5 విన్నర్ గా విజె సన్నీ నిలిచారు. అటాకింగ్ గేమ్ తో సన్నీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. కోపం అతనికి మైనస్ గా మారింది. అయితే టాస్క్స్, గేమ్స్ లో సన్నీ చాలా యాక్టీవ్ గా ఉండేవారు. అతని స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ కూడా బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చింది. భారీగా ఓట్లు వేసి టైటిల్ విన్నర్ ని చేశారు. 

గత బిగ్ బాస్ విన్నర్స్ తో పోల్చుకుంటే సన్నీ (Sunny) కెరీర్ మెరుగ్గా ఉంది. ఆయన నటించిన కొత్త చిత్రం సకల గుణాభి రామ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ చిత్రం సన్నీ బిగ్ బాస్ వెళ్లక ముందే మొదలైంది. సన్నీ టైటిల్ విన్నర్ కావడంతో మూవీకి మంచి హైప్ వచ్చి చేరింది. సకల గుణాభి రామ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కిల్లర్ ఫేమ్ ఆషిమా నర్వాల్ తో పాటు తరుణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

సీరియల్ నటుడిగా పేరున్న సన్నీ సకల గుణాభి రామ (Sakala Gunabhi Rama) మూవీతో వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. సకల గుణాభి రామ విజయం సాధిస్తే సన్నీ కెరీర్ ఊపందుకున్నట్లే. ఈ చిత్ర ఫలితం సంగతి ఎలా ఉన్నా... సెంటిమెంట్ ని బ్రేక్ చేసి కొత్త సినిమాతో కెరీర్ లో ఓ మెట్టు పైకి ఎదిగాడు సన్నీ. అదే సమయంలో సన్నీ పూర్తిగా ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని అధిగమించినట్లు చెప్పలేం. వచ్చే ఏడాది కాలం అతని కెరీర్ కి కీలకం. జనాలు మరిచిపోకముందే విజయం అందుకోవాలి. లేదంటే మిగతా బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ లిస్ట్ లో కలిసిపోతాడు. 

టైటిల్ గెలుపొందిన కౌశల్, శివబాలాజీ, అభిజీత్ ప్రత్యేకంగా పొందిన ప్రయోజనం ఏం లేదు. అభిజీత్ పరిస్థితి మరీ దారుణం. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం కొంతలో కొంత మెరుగైన కెరీర్ కలిగి ఉన్నారు. ఆయన సింగర్ గా రాణిస్తున్నారు. 

Scroll to load tweet…