బిగ్ బాస్ మూడో సీజన్ లో ఆగస్ట్ 15న సందర్భంగా హౌస్ కళకళలాడింది. స్కిట్ లు డాన్స్ లతో పాటు భారత్ మాతాకి జై అనే నినాదాలతో హోరేత్తించింది. మొదట శ్రీముఖి, అలీలు యాంకర్లుగా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.

ముందుగా స్త్రీ, పురుష సమానత్వంపై మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు స్కిట్ తో ఆకట్టుకున్నారు. ఆడవాళ్లు గొప్పా, మగవాళ్ల గొప్పా అన్ని విషయంపై కంటెస్టంట్స్ తమ అభిప్రాయాలను వివరించారు. మగవాళ్లు ఎంతమందితోనైనా మాట్లాడొచ్చని.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్ లు తమ వాదన వినిపించగా వాళ్లకు కౌంటర్ ఇస్తూ అషు, వితికా చెలరేగిపోయారు.

నచ్చినట్లుగా ఇంట్లో ఉండలేమని, పెళ్లి అనే ఒక్క కారణంతో ఇష్టాలన్నింటినీ వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి అన్నింటినీ త్యాగం చేస్తామని అషు రెడ్డి తన వాదన వినిపించగా.. సమాజంలో ఆడపిల్ల ఎలా అణచివేయబడుతుందో ఎమోషనల్‌గా తెలియజేస్తూ ఆడవాళ్ల గొప్పతనం తెలియజేసింది వితికా.

ఇక సీన్‌లోకి ఎంటర్ అయిన పునర్నవి ఆడవాళ్లు ఎందుకు మాట్లాడకూడదు.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎందులో తక్కువ అంటూ రెచ్చిపోయింది. ఒక అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే అది సోషలైజింగ్ అంటారు. అదే అమ్మాయి వెళ్లి అబ్బాయితో మాట్లాడితే.. క్యారెక్టర్ లెస్ అంటారు. ఇదీ అమ్మాయిలకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేశంగా మాట్లాడింది.