కరోనా కష్ట సమయంలో భారత దేశంలో దుర్బర పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా వలస కార్మికులు కలలో కూడా ఊహించని ఇబ్బందులు ఎదుర్కున్నారు. పనుల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు తిరిగి ఇంటికి వెళ్ళడానికి ప్రయాణ సౌలభ్యం లేక,  ఉన్న చోట పనిలేక ఆకలితో అలమటించి పోయారు. వందల మైళ్ళు నడకదారిన స్వగ్రామాలకు పయనమయ్యారు. ఆ సమయంలో నటుడు సోనూ సూద్ సొంత డబ్బుతో వలస కార్మికులు తమ ఊళ్లకు చేరే ఏర్పాటు చేశారు. 

వందల సంఖ్యలో బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి  కూలీలు ఇంటికి చేరేలా చూసుకున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏ సమస్యతో బాధపడినా సోనూ సూద్ స్పందించి వారికి సాయం చేశారు. కలిగియుగ కర్ణుడిగా మారిపోయిన సోను సూద్ రియల్ హీరోగా అనిపించుకున్నారు. ఆయన సేవలకు ట్రిబ్యూట్ గా ప్రముఖ సైక్లిస్ట్ నారాయణ్  కె వ్యాస్ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టారు.

 సోనూ సూద్ సేవలకు గుర్తుగా నారాయణ్ కె వ్యాస్ ఏకంగా 2000 కిలో మీటర్లు సైక్లింగ్ రైడ్ చేయనున్నాడు. మహారాష్ట్రకు చెందిన నారాయణ్ ఈ మేరకు ప్రకటించడం జరిగింది. రియల్ హీరో సోనూ సూద్ సేవలకు గుర్తుగా ఫిబ్రవరి 7న 2000 కిలోమీటర్ల సైక్లింగ్ రైడ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.