జాతీయ అవార్డుల్లో పెద్ద తప్పిదం చోటు చేసుకుంది. సింక్ సౌండ్ కేటగిరిలో అందించిన అవార్డు ఇప్పుడు విమర్శలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.
జాతీయ అవార్డుల(National Awards)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారి అవార్డుల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. అవార్డు కోసం ఎంపిక చేసే జ్యూరీ సభ్యులు ఏ సినిమాని ఏ కేటగిరిలో ఎందుకు ఇస్తున్నారో తెలయదా? అన్న విమర్శలు రావడం ఇప్పుడు దుమారం రేపుతుంది. ఈ సారి అవార్డుల్లో తమిళం, మలయాళంకే ఎక్కువ అవార్డులు దక్కాయి. కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలీ చిత్రాలకు ఊహంచని విధంగా అవార్డులు తగ్గడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే కరోనా కారణంగా సినిమాలు సరిగా రిలీజ్ కాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే జాతీయ అవార్డుల్లో పెద్ద తప్పిదం చోటు చేసుకుంది. సింక్ సౌండ్ కేటగిరిలో అందించిన అవార్డు ఇప్పుడు విమర్శలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆడియోగ్రఫీ విభాగంలో లొకేషన్ సౌండ్ రికార్డింగ్(సింక్ సౌండ్) (Sink Sound)కి సంబంధించిన బెస్ట్ ఫిల్మ్ గా కన్నడ చిత్రానికి చెందిన `డూళ్లు`(Dollu)ని ఎంపిక చేశారు. జోబిన్ జయన్‌కి ఈ అవార్డు అందించారు. అయితే ఈ సినిమాకి అసలు సింక్‌సౌండ్ ఉపయోగించలేదని సదరు సౌండ్ డిజైనర్ చెప్పడం గమనార్హం.
ట్విట్టర్ ద్వారా చిత్రానికి పనిచేసిన సౌండ్ డిజైనర్ నితిన్ లుకోసె ఈ విషయాన్ని వెల్లడించారు. `జాతీయ అవార్డుల ఎంపికలు, దాని ప్రక్రియల తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ డబ్, సింక్ సౌండ్ ఫిల్మ్ ల మధ్య తేడాని గుర్తించలేని జ్యూరీ తీర్పుపై నేను జాలిపడుతున్నా` అని తెలిపారు నితిన్ లుకోసే. దీన్ని మరో సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ట్వీట్ చేయడం విశేషం. దీంతో జాతీయ అవార్డుల జ్యూరీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింక్ సౌండ్ అంటే డైరెక్ట్ షూటింగ్ లొకేషన్‌లోనే ఆర్టిస్టుల నుంచి లైవ్‌గా సౌండ్‌ని క్యాప్చర్ చేయడం. డబ్బింగ్ అంటే షూటింగ్ అయ్యాక ప్రత్యేకంగా స్టూడియోలో ఆయా సీన్లకి డబ్ చెప్పడం. కానీ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పించినట్టు నితిన్ చెబుతున్నారు.సింక్ సౌండ్ వాడలేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటిది సింక్ సౌండ్ కేటగిరిలో ఎలా అవార్డులు ఇస్తారు? అసలు కనీస అవగాహన లేకుండా ఎలా ఎంపిక చేస్తారనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.
ఓ వ్యక్తి ఫోక్ బ్యాండ్లో పార్ట్ కావాలని తపిస్తుంటాడు. అందుకోసం ఆయన చేసే జర్నీనే `డూళ్లు` చిత్ర కథ. దీనికి సాగర్ పుర్నిక్ దర్శకత్వం వహించారు. నిధి హెగ్దే, బాబు హిరన్నయ్య, కార్తిక్ మహేష్, చంద్ర మయుర్, శరణ్యసురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికిగానూ నేడు(శుక్రవారం) ప్రకటించిన 68వ జాతీయ అవార్డుల(68th National Awards) ప్రకటనలో ఉత్తమ సింక్ సౌండ్ విభాగంలో జాతీయ అవార్డు ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
