Bholaa Shankar : సినీ చరిత్రలోనే తొలిసారి.. జీపీఎస్ తో చిరుముఖ చిత్రం.. ప్రచారం కోసం కాదండోయ్..
చిరంజీవిపై అభిమానంతో ‘భోళాశంకర్’ యూనిట్ ప్రపంచ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. భారీ ర్యాలీ, కటౌట్లతో ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ర్యాలీ ప్రారంభమైంది. డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) - మెహర్ రమేశ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఒక్క రోజులు Bholaa Shankar థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. చిరంజీవి - తమన్నా భాటియా (Tamannaah Bhatia) జంటగా నటించారు. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో అలరించబోతోంది. ఇక బుల్లితెర స్టార్స్ శ్రీముఖి, రష్మీ గౌతమ్, హైపర్ ఆది, గెటప్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈవెంట్ కు హాజరైన యంగ్ డైరెక్టర్స్, బుల్లితెర స్టార్స్, యాక్ట్రెస్ అందరూ చిరు అభిమానులు కావడం విశేషం. దీంతో అందరూ తమ స్పీచ్ లతో మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తమ మనస్సులోని మాటలను బయటపెడుతూ చిరుపై అభిమానాన్ని చూపించారు. ఇక తాజాగా ‘భోళా శంకర్’ యూనిట్ మరో వినూత్న కార్యక్రమానికి పూనుకుంది. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
గడచిన ఆర్ధశతాబ్దంలో, ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకుని, మైలురాళ్ళను తనదైన ప్రతిభాపాటవాలతో సృష్టించి, తెలుగు సినిమా చరిత్రలోనే తనవైన సరికొత్త అధ్యాయాలను రాసుకుని, కోటానుకోట్ల అభిమానుల గుండెలలో గుడికట్టుకున్న ఒక మహా కథానాయకుడు...కమర్షియల్ చిత్రానికి సంచలన నిర్వచనాలను చెప్పిన ఒక నిరుపమాన కథానాయకుడు....బాక్సాఫీసు ఎన్నడూ ఊహించని వసూళ్ళ పెనుతుఫానులను ప్రేరేపించిన ఒక అగ్రకథానాయకుడు... మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజాచిత్రం భోళాశంకర్ ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్న శుభసందర్భంలో ఒక అద్భుతమైన ఘట్టానికి తెరతీశారు.
ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ప్రపంచసినిమాలో ఏ కథానాయకుడికి జరిగిన దాఖలాలు లేని విధంగా, మెగాస్టార్ చిరంజీవి అసంఖ్యాక అభిమానులు పాల్గొని, మన భాగ్యనగర వీధులలో దాదాపు 600 కిలోమీటర్ల మేరకు జిపిఎస్ ట్రాకింగ్ సంవిధానంతో మెగాస్టార్ ముఖకవళికలే దారులుగా ఒక భారీ ర్యాలీని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రపంచ ప్రఖ్యాతమైన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఈ మహా సంబరం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం కేవలం భోళాశంకర్ ప్రచారం నిమిత్తం చేస్తున్నది కాదని పేర్కొన్నారు. ఆ మహా చిత్రకథానాయకుడి అంతులేని,అలుపులేని చిరకీర్తిని, స్థిరఖ్యాతిని పురస్కరించుకుని ఆయన అభిమానగణం పూనుకున్న ఆత్మీయమైన పండగ ఇది అని చెప్పారు.