సినీ ఆత్మహత్యలకు ముంబయి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల వరుసగా సినీ రంగానికి చెందిన నటీనటులు ఆత్మహత్యలు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, టీవీ నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాగే సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సైతం ఆత్మహత్య చేసుకున్నారు. కొత్తగా మరో నటి ఆత్మహత్యకు పాల్పడింది. భోజ్‌పూరికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్‌(40) ముంబయిలోని దహిసర్‌లోగల తన నివాసంలో సూసైడ్‌కి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమో చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆమె మరణానికి ఒకరోజు ముందు ఫేస్‌బుక్ లైవ్ లో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ లోకంలో ఎవరినీ నమ్మొద్దనీ, మోసపోయానంటూ అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. `అందరితో నమ్మకంగా ఉండండి. కానీ ఎవరినీ ఎప్పటికీ అంత ఈజీగా నమ్మకండి. ఇది నా జీవితంలో నేర్చుకున్న పాఠం. ప్రజలు చాలా స్వార్థపరులు ఇతరులను పట్టించుకోరు` అని ఫేస్‌బుక్‌లోని వీడియోలో తెలిపారు. 

ఇక ఆమె సూసైడ్‌ నోట్‌లో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. మలాడ్‌లోని విజ్ డమ్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే సంస్థలో పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. గతేడాది డిసెంబర్‌లో మెచ్యూరిటీ తేదీ తర్వాత కూడా ఆ డబ్బును చెల్లించలేదు. మరోవైపు మనీష్  ఝా అనే వ్యక్తి, లాక్ డౌన్ సమయంలో అనుపమ ద్విచక్ర వాహనాన్ని తీసుకొని తిరిగి ఇవ్వలేదని సూసైడ్ నోట్ లో ఆమె రాసినట్టు తెలుస్తుంది.  దీంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది.వరుసగా నటీనటులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో దీనికి కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. 

ఇటీవల లాక్‌ డౌన్‌ వల్ల వేల మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో జీవనం సాగడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జీవితం కష్టంగా మారడం, అదే సమయంలో కొందరు మోసాలకు పాల్పడటంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. మరి ఈ కేసులో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి. భోజ్‌పూరితోపాటు, ముంబయిలో సినిమాల్లో, పలు టెలివిజన్ సీరియల్స్ లో చిన్నా చితకా పాత్రలు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న అనుపమ పాథక్‌ స్వస్థలం బీహార్‌ లోని పూర్నియా జిల్లా అని, సినిమాలపై ఆసక్తితో ముంబయి వచ్చినట్టు తెలుస్తుంది.