నేడు మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వుమెన్ పోలీసులకు భీమ్లా నాయక్ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా నటించారు.
రానా దగ్గుబాటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మలయాళీ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చారు. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సిన్సియర్ పోలీస్ అధికారిగా కనిపించారు. నేడు ప్రపంచం మొత్తం ఉమెన్స్ డే సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వుమెన్ పోలీస్ అధికారులకు భీమ్లా నాయక్ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ వేయించబోతున్నారు.
దీనికోసం సివి ఆనంద్ 1200 టికెట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం మహిళా పోలీసులు హైదరాబాద్ లోని జివికె మాల్ లో భీమ్లా నాయక్ స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించబోతున్నట్లు తెలుస్తోంది.
భీమ్లా నాయక్ చిత్రం సి వి ఆనంద్ కి బాగా నచ్చిందట. ఈ చిత్రంలో మహిళలకు ప్రాధాన్యత కనిపించిందని సివి ఆనంద్ ప్రశంసించారు. సివి ఆనంద్ మాట్లాడుతూ.. మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అంత సులువు కాదు. కానీ చాలా మంది మహిళలు పోలీస్ జాబ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అద్భుతంగా రాణిస్తున్నారు కూడా అని అన్నారు.
ఇక సినిమాల్లో కూడా పోలీసులని, మహిళా పోలీసులని శక్తివంతంగా చూపించడం చూస్తూనే ఉన్నాం. సినిమాల ద్వారా మహిళ ప్రాముఖ్యత తెలియజేస్తున్నారు అని అన్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో నటి మౌనిక రెడ్డి పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా కీలక పాత్రలో నటించింది. కథలో భాగంగా పవన్ తో పాటు ఆమె కూడా చిక్కుల్లో పడుతుంది.
ఇక క్లైమాక్స్ సన్నివేశంలో పవన్ చెప్పే డైలాగ్ మహిళలల్ని ఆకట్టుకునేలా ఉంటాయి. బహుశా అందుకేనేమో మహిళా దినోత్సవం రోజున మహిళా పోలీసులకు ఇది పర్ఫెక్ట్ ఫిలిం అని కమిషనర్ సివి ఆనంద్ భావించారు.
