బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న `భగవంత్ కేసరి` చిత్రం దసరా కి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్.
నందమూరి బాలకృష్ణ(Balakrishna).. వరుస హిట్లతో ఉన్నారు. `అఖండ`, `వీరసింహారెడ్డి` విజయాలు ఆయనలో జోష్‌ని నింపాయి. అదే జోష్‌తో ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ కేసరి` (Bhagavanth Kesari) చిత్రం రూపొందుతుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.
అలాగే గణేష్ పై `గణేష్ ఆంథెమ్` వచ్చే మొదటి సాంగ్ కూడా ఆకట్టుకుంది. అయితే దానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. వినాయకచవితికి మోత మోగిస్తుందని భావించినా అది జరగలేదు. ఈ విషయంలో థమన్ డీలా పడిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెకండ్ సింగిల్‌ని తీసుకురాబోతున్నారు. సినిమా దసరాకి విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల ఊపు పెంచారు. అందులో భాగంగా `ఉయ్యాలో ఉయ్యాల` అంటూ సాగే రెండో పాటకి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది.
అక్టోబర్ 4న ఈ పాటని విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఓ నది ఒడ్డున గట్టుపై బాలకృష్ణ, చిన్న పాప కూర్చొని ఉన్నారు. ఇందులో బాలయ్య యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పాట ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుందని తెలుస్తుంది. ఆ పాప, బాలయ్య మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా ఈ పాట సాగుతుందని టాక్. అయితే ఆ పాపకి బాలయ్య బాబాయ్ అవుతారని తెలుస్తుంది. మొన్న విడుదల చేసిన గణేష్ పాటలో `కాక` అనే పదాన్ని పలికిన విషయం తెలిసిందే.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్(Kajal) హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నెగటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న చిత్రమిది. విజయదశమి కానుకగా అక్టోబర్ 19 ఈ చిత్రం విడుదల కాబోతుంది.
