నటన వదిలి పాలిటిక్స్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేసిన నటుడు బండ్ల గణేష్. అయితే ఆయన ట్రిక్స్ ఏమీ రాజకీయాల్లో ఫలించలేదు. దాంతో తిరిగి మళ్లీ తను మొదలైన చోటకే అంటే నటనకే వచ్చేసారు.చాలా గ్యాప్  తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు.  మహేష్‌బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో బండ్ల గణేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇఫ్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని కాశ్మీర్‌లో విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ లో షూట్ జరుగుతోంది.

ఇక ఈ షెడ్యూల్ లో రవితేజ వెంకీ సినిమా తరహాలో ఓ ట్రెయిన్ ఎపిసోడ్ ఫన్నీగా నడవనుంది. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కాకుండా బండ్ల గణేష్ పై పూర్తి కామెడి చేయనున్నారు.   ఈ చిత్రంలో బండ్ల గణేష్ పాత్ర పేరు బ్లేడ్ గణేష్ అని వినిపిస్తోంది. బండ్ల గణేష్ పాత్ర ఓ కోటిశ్వరుడు కొడుకు క్యారక్టర్ అని, అతనికి విపరీతమైన డబ్బు ఉన్నా..బుర్ర మాత్రం ఉండదని..ఆ పాత్రలో గణేష్ చేసే చేష్టలు తెగ నవ్విస్తాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో సీనియర్‌ నటి విజయశాంతి మరో కీలక పాత్రలో నటించనున్నారు. రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్‌బాబు నటిస్తున్నారీ సినిమాలో.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.