బాలయ్యతో కామెడీ చేయటానికి డైరక్టర్స్ సాహసించరు. గతంలో ఇవివి వంటి దర్శకులు కామెడీలోకి బాలయ్య తీసుకొద్దామని ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. యాక్షన్ ఇమేజ్ రాకముందు బాబాయ్ అబ్బాయ్ వంటి కామెడీ చేయగలిగారు కానీ ఆ తర్వాత ఆ ధైర్యం చేయలేదు. అయితే ఆయనకు ఓ కామెడీ యాక్షన్ ఫిల్మ్ చేయాలని చాలా కాలంగా ఉందిట. ఆ మధ్యన అనీల్ రావిపూడి దర్శకత్వంలో రామారావుగారు టైటిల్ తో ప్లాన్ చేసారు కానీ ముందుకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఆ కోరిక తీరబోతోందిట. అందుతున్న సమాచారం మేరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

మైత్రీ మూవీస్ బ్యానర్ వారు నిర్మించే ఈ సినిమా లో హై ఓల్టేజ్ యాక్షన్ ఓ ప్రక్క, పగలబడి నవ్వించే కామెడీ మరో ప్రక్క ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటికే బాలయ్య కథ విని పూర్తి స్క్రిప్టు రెడీ చేసుకోమని చెప్పారట. బాలయ్య అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేలా అన్ని ఎలిమెంట్స్ ఈ కథలో కూర్చారట. అలాగే మైత్రీ మూవీస్ వారు కూడా ఈ ప్రాజెక్టుని భారీగా నిర్మించాలని ఫిక్స్ అయ్యారట.
  
ప్రస్తుతం గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రాక్ సినిమా ఫిల్మ్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాంతో మైత్రీ వారు ఈ ప్రాజెక్టుకు మరో ఆలోచన చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 

ఇక ‘డాన్‌ శీను’తో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు గోపీచంద్‌ మలినేని, రవితేజ. ఈ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘బలుపు’. ఈ రెండు చిత్రాలు యాక్షన్‌ నేపథ్యంలో సాగేవే. డాన్, రౌడీ షీటర్‌గా చూపించిన గోపీ ఇప్పుడు రవితేజను పోలీసు అధికారిగా    పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం వీళ్లు కలిసి పనిచేస్తున్న చిత్రం ‘క్రాక్‌’. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతోంది. ఇందులో పోలీసు అధికారి వీర శంకర్‌ పాత్రలో కనిపించనున్నాడు రవితేజ. ఇటీవలే గోవాలో పాట షూటింగ్‌ జరుపుకొన్న ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలకానుంది.