బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 

DID YOU
KNOW
?
`అఖండ 2`తో బాలయ్య
బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇది సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే తాను ఇండస్ట్రీలో నటుడిగా 50ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు ఘనంగా ఈవెంట్‌ని కూడా నిర్వహించారు. చిరంజీవి, వెంకటేష్‌ కూడా హాజరై బాలయ్య గొప్పతనాన్ని చాటి చెప్పారు. తాజాగా బాలయ్యకి మరో అరుదైన గౌరవం దక్కించింది. వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్యకి స్థానం దక్కింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా బాలయ్య రికార్డు సృష్టించారు.

బాలయ్య యాభై ఏళ్ల జర్నీకి అద్భుతమైన గుర్తింపు 

లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR).. యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణకి ప్రదానం చేస్తున్నారు. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అపూర్వమైన సినిమా జైత్రయాత్ర కి అత్యంత గౌరవప్రదమైన ఘనతగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో యాభై ఏళ్లు కొనసాగిన అద్భుతమైన మైలురాయికిది నిదర్శనంగా నిలుస్తుంది.

ఎన్టీఆర్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య

బాలకృష్ణ తన కెరీర్ మొత్తం తన తండ్రి, లెజెండరీ నందమూరి తారక రామారావు (NTR) శాశ్వత వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, టాలీవుడ్‌లో తన ఆల్ రౌండర్ ప్రతిభతో, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, తన కళపట్ల అవిరామమైన నిబద్ధతతో తనదైన గుర్తింపును సాధించుకున్నారు. అందరు కళాకారుల్లాగే బాలకృష్ణ కూడా తన మార్గంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ ఆయన స్థిరత్వం, ధైర్యం, విభిన్న పాత్రలతో నిరంతర ప్రయోగాలు చేస్తూ మారుతున్న ట్రెండ్‌ని పట్టుకుని అందులో విజయం సాధించారు. విజేతగా నిలుస్తున్నారు.

బాలయ్య సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కారం 

బాలకృష్ణ తన సినీ జీవితంలో చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. నటుడిగా కోట్ల మందిని అలరించారు. ఇండియన్‌ సినిమాకి ఆయన చేస్తోన్న సేవాలకుగానూ కేంద్రప్రభుత్వం బాలయ్యని పద్మ భూషణ్‌ పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ఆయన నటించిన `భగవంత్‌ కేసరి`కి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు వరించింది. బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఈ రూపంలో కూడా ప్రజల విశ్వాసం, ప్రేమను మరోసారి గెలుచుకున్నారు. ఆయన నిబద్ధత, డైనమిక్ లీడర్‌షిప్‌తో, హిందూపుర్‌ను మార్చడమే కాకుండా దానిని ఆదర్శ నియోజకవర్గంగా రూపొందించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో బెంచ్‌మార్క్‌లను సృష్టించారు.

బాలయ్య సినీ జీవితం ఆదర్శం

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా జారీ చేసిన అధికారిక ప్రశంసలో, బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా ప్రశంసించారు. ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్‌మార్క్‌ను స్థాపించిన వారసత్వంగా వర్ణించారు. కానీ బాలకృష్ణ గొప్పతనం సిల్వర్ స్క్రీన్‌కు మించి విస్తరించింది. గత 15 సంవత్సరాలుగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా, ఆయన పబ్లిక్ సర్వీస్‌ను ఒక ఉదాత్త మిషన్‌గా నిరూపించారు.

ఆగస్ట్ 30న బాలయ్యకి ఈ అరుదైన సత్కారం 

ఈ గౌరవంతో, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అసాధారణ సాధనలలో అద్భుత మైలురాళ్లను మాత్రమే కాకుండా వ్యక్తులను నిజమైన లెజెండ్‌లుగా చేసే మానవ విలువలు, సేవలను గుర్తించే తన మిషన్‌ను బలపరుస్తుంది. భారతీయ సినిమాలో హీరోగా ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణ చోటు సంపాదించినదానికి గుర్తుగా, ఈ గుర్తింపుని WBR CEO ఆగస్టు 30వ హైదరాబాద్‌ లో స్వయంగా బాలకృష్ణకి అందించనున్నారు.