బాలయ్య ఒక్కోసారి తన మాటలతో జనాలకు షాక్ ఇస్తూంటారు. ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్ లలో ,ఫంక్షన్స్ లో ఆయన మాటలు, ప్రవర్తన చాలా సార్లు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా  నందమూరి బాలకృష్ణ మరోసారి తన మాటలతో జనాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సారి ఆయన కరోనా గురించి చేసిన కామెంట్స్ సెన్సేషన్ గా మారాయి. కరోనాకి అందరూ వ్యాక్సిన్ గురించి ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా రాలేదు అన్న విషయం మనందరికీ తెలుసు.అదే సమయంలో , ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ని వీలైనంత తొందర్లో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలో బాలయ్య మాత్రం ఇప్పుడు వాక్సిన్ లేదు, ఇకపై రాదు అన్నట్లుగా మాట్లాడారు. “సెహరి” అనే చిన్న సినిమా ఫస్ట్ లుక్ ని బాలయ్య ఈ రోజు ఆవిష్కరిస్తూ ఈ కామెంట్స్ చేసారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. “‘ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఎలా ఉండాలనే విషయాన్ని అందరూ ఆలోచించాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడు కరోనా పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ షూటింగ్ చేస్తున్న ‘సెహరి’ యూనిట్‌ను నేను అభినందిస్తున్నాను. పలు ఛానెల్స్‌లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ కార్తీక మాసంలో చల్లటి నీటితో తలస్నానం చేయండని చెబుతారు. కానీ ఎవరూ కూడా చల్లటి నీళ్లతో తలస్నానం చేయవద్దని నేను చెబుతున్నాను.

ఎందుకంటే కరోనా అనేది నిమోనియాకు సంబంధించింది. దానికి ఇంత వరకు వ్యాక్సిన్‌ రాలేదు. రాదు కూడా. కరోనా అనేది మనిషి మెదడును కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. ప్రకృతిని మనం అతిక్రమిస్తే, ప్రకృతి మనకెలా సమాధానం చెబుతుందనే దానికి ఉదాహరణే ఈ కరోనా. కాబట్టి ఎవరూ తలస్నానాలు చల్లటి నీటితో చేయవద్దు. వేడి నీళ్లతోనే స్నానాలు చేయండి. ఆరోగ్య సూచనలు పాటించండి. కరోనా వైరస్‌ నివారణకు ఇంకా సమయం పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనం బలంగా ఉండాలి. చూస్తుంటే కరోనా అనేది మన జీవితంలోఓ భాగమైపోతుందేమోననిపిస్తుంది’’ అన్నారు. బాలయ్య చెప్పిందాంట్లో నిజమే ఉందో లేదో కానీ... “ఇక పై వ్యాక్సిన్ రాదు,” అనడమే అందరినీ ఆశ్చర్యపరిచింది.