నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ నందమూరి అభిమానులకు నిరీక్షణ మాత్రం తప్పడం లేదు. తాజాగా మోక్షజ్ఞ గురించి ఆసక్తికర ప్రచారం జోరందుకుంది. 

బాలకృష్ణ ఇటీవల సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుని కలసినట్లు తెలుస్తోంది. బాలయ్య, సింగీతం కాంబోలో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తాడని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బాలయ్య తాజాగా సింగీతంతో భేటీ కావడంతో ఆసక్తిని రేపుతోంది. 

అప్పుడప్పుడు మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మోక్షజ్ఞ నటుడిగా మారేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. సరైన దర్శకుడు, కథ కుదిరితే తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.