కరోనా లాక్‌ డౌన్‌ తరువాత సినీ ఇండస్ట్రీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందకు సినీ పెద్దలు ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్న సంగతి తెలసిందే. అయితే ఈ చర్చలకు మెగాస్టార్ చిరంజీవి ముందుండి బాధ్యత తీసుకున్నారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు లాంటి వారు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ చర్చలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవటం పెద్ద దుమారమే రేపుతోంది.

ఈ విషయంలో బాలకృష్ణ బహిరంగంగానే తన అసహనం వ్యక్తం చేశాడు. సినీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని, భూములు పంచుకుంటున్నాడని ఘాటుగా వ్యాఖ్యనించాడు. అయితే ఈ విషయంలో బాలయ్య వ్యాఖ్యలు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఎవరికీ వారు ఇన్సియేట్‌ తీసుకోవాల్సిన సమయంలో ఇలా మాట్లాడటం సరికాదన్న వాదన కూడా వినిపిస్తోంది.

అయితే మెగా బ్రదర్‌ నాగబాబు, బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాడు. బాలకృష్ణ నోటి దురుసుతో మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అంతేకాదు బాలకృష్ణ సినీ పెద్దలకు, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలను కూడా ఆయన డిమాండ్‌ చేశాడు. గతంలో ఎన్నికల సమయంలో తన యూట్యూబ్‌లో బాలయ్య ఉద్దేశిస్తూ చాలా కామెంట్స్ చేశాడు నాగబాబు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఫ్యాన్స్ నాగబాబుపై ఫైర్‌ అవుతున్నారు.

బాలకృష్ణ సినిమాల్లోని క్లిప్స్‌ను షేర్ చేస్తూ నాగబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. #WeStandWithBalayya #WeSupportBalakrishna అనే హ్యాష్‌ ట్యాగ్‌లను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వివాదం ముందు ముందు ఇంకెన్న మలుపులు తిరుగుతుందో చూడాలి.