బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో అ్రగ హీరోల్లో ఒకరు. నందమూరి నట సింహం గా పేరు తెచ్చుకుని తండ్రి ఎన్టీఆర్‌కి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్‌ నట వారసత్వానికి వారధిగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్‌ తనయుల్లో ఎవరూ నటులుగా గొప్ప స్థాయిలో రాణించలేకపోయారు. కానీ బాలకృష్ణ ఒక్కడే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విశేష అభిమానగణాన్ని సంపాదించారు. 

తాజాగా బాలయ్య 46ఏళ్ళ కెరీర్‌ని పూర్తి చేసుకున్నారు. రేపటితో(ఆదివారం)తో ఆయన తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన 46ఏళ్ళు పూర్తవుతుంది. తొలిసారి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ దర్శకత్వంలో రూపొందిన `తాతమ్మ కల` చిత్రంలో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు. ఇది 1974 ఆగస్ట్ 30న విడుదలైంది. బాల నటుడిగా కొన్ని సినిమాల్లో మెరిసిన బాలయ్య పదేళ్ళ తర్వాత `సాహసమే జీవితం` చిత్రంతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. 

ఇక బ్యాక్‌ టూ బ్యాక్‌ తండ్రి ఎన్టీఆర్‌ సపోర్ట్ తో వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ సినిమాలతో బాగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాస్‌ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్‌, యాక్షన్‌, ఫ్యాక్షనిజం సినిమాలకు కేరాఫ్‌ ఎవరంటే బాలకృష్ణనే గుర్తొస్తారు. `సింహా`, `లెజెండ్‌` సినిమాలు ఆయన్ని ఇటీవల తిరుగులేని మాస్‌ హీరోగా నిలబెట్టాయి. 

ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `సింహా`, `లెజెండ్‌` వంటి బ్లాక్‌ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఇటీవల కాలంలో వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్య ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. మిర్యాల రవీందర్‌.. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతుంది. రేపటితో 46ఏళ్ళ కెరీర్‌ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బాలకృష్ణకి చెందిన లుక్‌ని పంచుకున్నారు. అంతేకాదు `46గ్లోరియస్‌ ఇయర్స్  ఆఫ్‌ ఎన్‌బీకే` పేరుతో యాష్‌ ట్యాగ్‌ని, అలాగే సీడీపీని విడుదల చేశారు. 

ఇందులో ఒక సర్కిల్‌లో బాలయ్యు ఉండగా, పైన సినిమాల్లోని బాలయ్య గెటప్‌లు, కింద ఆయన మైలు రాయి లాంటి సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే 46ఏళ్ళ కెరీర్‌ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేపు తాజా సినిమాకి చెందిన ఏదైనా అప్‌డేట్‌ ఇస్తారా? అని ఆయన అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.