శివన్న కోసం బాలయ్య.. `వేద` ప్రీ రిలీజ్ ఈవెంట్ డిటెయిల్స్ ..
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటించిన `వేద` చిత్రం కోసం బాలకృష్ణ రాబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటం విశేషం.

కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న నయా మూవీ `వేద`. కన్నడలో రూపొంది బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువాదం చేస్తున్నారు. హర్ష దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేసన్స్ పతాకంపై రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు గ్రాండ్‌గా చేస్తున్నారు. ప్రభాస్, రామ్‌చరణ్ వంటి పెద్ద స్టార్లని ఇన్‌వాల్వ్ చేయడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
`వేద` ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని ప్రభాస్ విడుదల చేయగా, రామ్‌చరణ్ ట్రైలర్ ఆవిష్కరించారు. అలాగే `పుష్ప పుష్ప` అనే పాటని నిర్మాత వివేక్ కూచిబొట్ట రిలీజ్ చేశారు. ఈ నెల 9న సినిమా విడుదల కాబోతుంది. దీంతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. దీనికి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గెస్ట్ గా రాబోతుండటం విశేషం. రేపు(మంగళవారం) సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తుండగా, శివన్న కోసం బాలయ్య అతిథిగా రాబోతుండటంతో ఆసక్తి నెలకొంది.
గతంలో బాలకృష్ణ నటించిన `గౌతమి పుత్ర శాతకర్ణి`లో శివన్న చిన్న పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. నందమూరి ఫ్యామిలీతో వారికి మంచి అనుబంధం ఉంది. మొన్న తారకరత్న అనారోగ్యంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చేరగా, శివరాజ్‌కుమార్ పరామర్శించి వెళ్లారు. ఇప్పుడు ఆయన కోసం బాలయ్య వస్తున్నారు.
ఈ సినిమా గురించి చిత్ర బృందం చెబుతూ, `వేద` చిత్రం శివ రాజ్‌కుమార్ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది ఆయన 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ నుంచి మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న గురువారం తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. మాములుగా ఇండస్ట్రీలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నాం` అని తెలిపింది.
ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది.శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు.
దర్శకత్వం : హర్ష
నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్
సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
సంగీతం: అర్జున్‌జన్య
పి.ఆర్. ఓ: వి. ఆర్ మధు
డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం