నందమూరి నటసింహం బాలకృష్ణ జన్మదిన వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. జూన్ 10న బాలయ్య బర్త్ డే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరాలు జరుపుకోనున్నారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో బహిరంగ వేడుకలకు అనుమతి లేదు. బాలకృష్ణ సైతం తన బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని, తనను కలవడానికి ఎవరూ రావద్దని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 


ప్రత్యేక సందర్భాలలో నిరాశ పరచకుండా ఫ్యాన్స్ కి కావలసినది ఇచ్చేయడం బాలయ్యకు అలవాటు. దీనితో బర్త్ డే నాడు కూడా ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ లు సిద్ధం చేశారన్న మాట వినిపిస్తుంది. దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు ఫస్ట్ లుక్ టీజర్స్ విడుదలయ్యాయి. 


బాలయ్యకు సంబంధించిన రెండు గెటప్స్ రివీల్ చేశారు. ఓ పాత్రలో బాలయ్య అఘోరాగా కనిపించనుండగా దానికి సంబంధించిన టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ మోత పుట్టించింది. అఖండ మూవీ తరువాత క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య మూవీ చేస్తున్నారు. కాగా బాలయ్య బర్త్ డే నాడు అఖండతో పాటు గోపీచంద్ మలినేని మూవీల నుండి రెండు అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తుంది.