తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన `బలగం` చిత్రం విశేష ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన `బలగం` చిత్రం నెల రోజుల క్రితం విడుదలై ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఓటీటీలో వచ్చినా కూడా ఈ సినిమాని ఇంకా థియేటర్లలో చూస్తున్నారు ఆడియెన్స్. మరికొందరైతే ఓటీటీలో రావడంతో ఏకంగా ఊర్లలో ఓపెన్‌గా షోలు వేసి ఊరు జనాలకు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతోపాటు ఆ వీడియోలో వైరల్‌ అయ్యాయి. అయితే ఇది తప్పు అంటూ వారిపై చర్యలు తీసుకోవాలని దిల్‌రాజు ప్రొడక్షన్‌ నుంచి పోలీసులకు కంప్లైయింట్‌ కూడా చేశారు. 

తాజాగా దీనిపై నిర్మాత దిల్‌రాజు ఓపెన్‌ అయ్యారు. అది ఓటీటీ సంస్థకి అమ్మే సందర్భంలో ఉన్న నిబంధన ప్రకారం మాత్రమే కంప్లెయింట్‌ చేయడం జరిగిందని, కావాలని షోలను ఆపించే ఉద్దేశం కాదని తెలిపారు. ఈ సినిమా ఎక్కువ మంది జనాలకు రీచ్‌ కావడమే తమ లక్ష్యమన్నారు. ఎంత ఎక్కువ మందికి రీచ్‌ అయిన, వారి కుటుంబాల్లో మార్పు వస్తే తమ జన్మ ధన్యమవుతుందని తెలిపారు. అవసరమైతే ఎక్కడైనా థియేటర్లు లేకపోతే, షోలు కావాలంటే తామే అరెంజ్‌ చేస్తామని స్పష్టం చేశారు దిల్‌రాజు. 

`బలగం`తెలంగాణ పల్లెల్లోని కల్చర్‌ని ఆవిష్కరించిన చిత్రం. అందులో కుటుంబ అనుబంధాల, వాటి ప్రయారిటీని చూపించింది. అన్నదమ్ముల మధ్య మనస్పార్థాలను, కలహాలు లేని కుటుంబం కావాలనే సందేశంతో రూపొందిన సినిమా. దీంతో ఈ చిత్రానికి తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక్కడి ప్రజలు ఈ సినిమాని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా ఇరవైఐదు కోట్లకుపైగా కలెక్షన్లు సాధించడం విశేషం. 

ఈ సినిమాకి ఇప్పటికే ఏడు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అందులో లాస్‌ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు కూడా ఉండటం విశేషం. సినిమా, దర్శకుడికి, నటీనటులకు ఈ అవార్డులు వచ్చాయి. అయితే ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ అవార్డు దక్కిన నేపథ్యంలో `బలగం` సినిమాని ఆస్కార్‌కి పంపించే ఉద్దేశ్యం ఉందా? అనే ప్రశ్నకి దిల్‌రాజు స్పందించారు. తాము కూడా ఆ ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఇటీవలే కార్తికేయ(రాజమౌళి కుమారుడు)ని కలిసి ఆస్కార్‌ని ఎలా పంపించాలనే ప్రాసెస్‌ గురించి తెలుసుకున్నామని, కచ్చితంగా ఈ సినిమాని ఆస్కార్‌కి పంపించే ప్రయత్నం చేస్తామన్నారు. 

అయితే దానికి ఎంత ఖర్చు అవుతుందనేదానిపై కూడా చర్చిస్తామని, పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుని ఆస్కార్‌ అవార్డు కోసం పంపించే ప్రయత్నం చేస్తామన్నారు. అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ప్రత్యేకంగా షోస్‌ వేయడం వల్ల ఎక్కువ ఖర్చు అయ్యిందని, కానీ `ది ఎలిఫెంట్‌ విస్పరర్స్` చిత్రానికి ఎలాంటి ఖర్చులేదని, అసలు ఆవార్దు వస్తుందని కూడా వాళ్లు ఊహించలేదని, వచ్చేంత వరకు వాళ్లకి నమ్మకం లేదని తెలిపారు. `బలగం`ని ఎలా పంపించాలనేదానిపై చర్చిస్తామని చెప్పారు. జాతీయ అవార్డు వస్తుందని చాలా రోజులుగాఅంతా అంటున్నారు. కానీ అవార్డు వస్తే హ్యాపీ, రాకుంటే బాధపడేది లేదు. అవార్డుల కోసం సినిమా తీయలేదు, ఎక్కువ ఆడియెన్స్ కి రీచ్‌ కావాలని మాత్రమే ఈ సినిమా తీశామని, ఇంత పెద్ద హిట్‌ అవుతుందని, ఇంతటి సంచలనాలు సృష్టించిందని ఊహించలేదన్నారు. కమెడియన్‌ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందిన `బలగం` చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్‌పై హర్షిత్‌, హన్సిత నిర్మించారు. ప్రియదర్శి, కావ్య ముఖ్య పాత్రలు పోషించారు.