Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి-ది కన్ క్లూజన్ మూవీ రివ్యూ

  • చిత్రం: బాహుబలి-ది కన్ క్లూజన్
  • నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్
  • దర్శకత్వం : ఎస్.ఎస్ రాజమౌళి
  • నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
  • సంగీతం : ఎమ్.ఎమ్ కీరవాణి
  • ఏసియానెట్ రేటింగ్- 4/5
bahubali the conclusion review movie

కథ :

బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రం అమరేంద్ర బాహుబలి పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైనట్లు తెలిపే వాయిస్ తో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమై అమరేంద్ర బాహుబలి రాజమాత శివగామి(రమ్య కృష్ణ) ఆజ్ఞ మేరకు మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవడానికి సన్నద్ధమయ్యే సన్నివేశాలతో మొదలై ముందుకు సాగుతుంది. రాజు కాబోతున్న బాహుబలి దేశయాటనకు బయలుదేరి కుంతలదేశం చేరుకొని ఆ దేశపు యువరాణి అయిన దేవసేనను ప్రేమిస్తాడు. అది తెలుసుకున్న భల్లాల దేవుడు బాహుబలి రాజు కాకుండా ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో బాహుబలి ప్రేమించిన దేవసేనను తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని, దేవసేనను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని శివగామిని కోరతాడు. ఆ కోరిక మన్నించిన శివగామి రాయబారం పంపగా.. దేవసేన తిరస్కరిస్తుంది. ఆగ్రహించిన రాజమాత శివగామి దేవసేనను బందీగా చేసుకుని తీసుకురావాలని ఆదేశిస్తుంది. ప్రేమించిన పాపానికి బాహుబలి తన గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి... బాహుబలి వెంట మాహిష్మతికి వెళ్తుంది. అయితే అక్కడే మరో కుట్రతో భల్లలాదేవుడు శివగామీ దేవి బాహుబలిని రాజుని చేయకుండా ఆపేలా చేస్తాడు. తాను రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అలా భల్లాలదేవుడు రాజుగా మారి బాహుబలిని అప్పటకి సైన్యాధిపతిగా నియమించేలా చేసిన కుట్రలో సక్సెస్ అవుతాడు. కానీ భల్లాలుని కుట్రలు అంతటితో ఆగవు. రాజుగా అధికారం చేపట్టాక బాహుబలిని అంతఃపురం నుంచి బయటికి పంపించేస్తాడు.

 

అలా కుట్రలు కుతంత్రాలతో రాజైన భల్లాలదేవుడు బాహుబలిని, అతని భార్య దేవసేనను ఎలాంటి కష్టాలు పెట్టాడు ? అసలు శివగామి బాహుబలిని రాజు కాకుండా ఎందుకు ఆపింది ? బాహుబలిని కట్టప్పే ఎందుకు చంపాల్సి వచ్చింది ? కన్నతల్లి అయిన శివగామిదేవిని కూడా భల్లాలుడు ఎందుకు చంపాలనుకుంటాడు ? తన తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకున్న మహేంద్ర బాహుబలి భల్లలాదేవుడ్ని ఎలా అంతం చేశాడు ?  అనేదే తెరపై నడిచే కథ.

నటీనటులు:

ఇక రాజమౌళి నటీనటుల నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో పూర్తి విజయం సాధించారు. నటీనటుల ఒక్కొక్కరు తమ పాత్రల మేర ఎవరికి వారే పోటాపోటీగా నటించారు. ముందుగా ప్రధాన పాత్రధారి ప్రభాస్ విషయానికొస్తే ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ రాజసాన్ని, మంచితనాన్ని, యుద్ధంలో వీరత్వాన్ని, అనుష్క సాన్నిహిత్యంలో ప్రేమను, ధర్మం కోసం తల్లినే ఎదిరించే కొడుకుగా తనలోని సంఘర్షణను చాలా బాగా వ్యక్తపరిచాడు. అలాగే ప్రస్తుతంలో దుష్టుడైన పెదనాన్నను పడగొట్టి, తల్లి పగను తీర్చి, తన తండ్రిని నమ్ముకున్న ప్రజలకు విముక్తి కలిగించే మహేంద్ర బాహుబలి అలియాజ్ శివుడి పాత్రలో కూడా వీరోచితమైన పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

అలాగే భల్లాదేవుని పాత్రలో రానా చాలా బాగా నటించాడు. ఒక స్వార్థపూరితమైన వ్యక్తిగా, బలవంతుడిగా అతని నటన, హావభావాలు చాలా రోజుల తర్వాత అసలైన విలనిజం అంటే ఏమిటో చూపించాయి. ప్రభాస్ తో ముఖాముఖి తలపడే సన్నివేశాల్లో, యుద్ధ సన్నివేశాల్లో రానా బల ప్రదర్శన, బాడీ లాంగ్వేజ్, ఉద్రేకపూరితమైన నటన చాలా బాగున్నాయి. ప్రతి నాయకుడు బలంగా ఉంటేనే కథా నాయకుడి స్థాయి పెరిగి సినిమా పండుతుందనే ధర్మాన్ని చాలా ఖచ్చితంగా పాటించాడు రానా.


కుంతలదేశపు యువరాణిగా అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసింది. ఒక అందమైన, ఆత్మగౌరవం, చిన్నపాటి అహంకారం కలిగిన యువరాణిగా ఆమె నటన చాలా బాగుంది. ఆమె ప్రభాస్ తో కలిసి యుద్ధంలో పోరాడే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.


రాజమాత శివగామి దేవిగా రమ్యకృష్ణ రెండవ భాగంలో కూడా ఆకట్టుకుంది. కనిపించే ప్రతి ఫ్రేములో రాజసం ఉట్టిపడేలా నటించారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాల్లో అయితే తిరుగులేదనే స్థాయిలో నటించారు.

కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయి నటించాడు. సినిమా ఆద్యంతం హీరోతో పాటే కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తూ మెప్పించాడు. మొదటి అర్థ భాగంలో ప్రభాస్ తో కలిసి మంచి హాస్యాన్ని కూడా పండించాడు. ఇక బాహుబలిని చంపే సన్నివేశంలో, చంపాక శివగామిదేవితో మాట్లాడే సన్నివేశంలో ఆయన గొప్ప స్థాయి నటనను కనబర్చారు.

ప్లస్ పాయింట్స్:

‘బాహూబలి’ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఓ అద్భుతమైన విడువల్ వండర్. రాజమౌళి విజన్ కు తగ్గట్టు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ మాహిష్మతి సామ్రాజ్యాన్ని, కుంతల దేశాన్ని చాలా అద్భుతంగా రూపొందించగా.. వాటిని సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా కనబడేలా ఆర్.సి. కమల్ కణ్ణన్ ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను అందించగా,  సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వీరి నలుగురి పనితనంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆశించిన భారీతనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తూ ఆశ్చర్యపడేలా చేసింది.

 

సీన్ టు సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ సినిమా పూర్తయ్యే వరకు ప్రేక్షకుల్లో కొనసాగేలా చేయడంలో దర్శకుడు రాజమౌళి భలా అనిపించుకున్నాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సుల్లో రమ్యకృష్ణ, అనుష్క, ప్రభాస్ ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది.

 

కథనంతో పాటు ఒక్కో పాత్రను మరింత లోతుగా తీర్చిదిద్ది సినిమాను నడిపిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ లోని హీరోయిజాన్ని తెరపై వీరోచితంగా చూపించడంలో జక్కన్న నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే అతి ముఖ్యమైన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానాన్ని కన్విన్సింగ్ గానే చూపించారు. దీనికి మించి కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణాలు, దారి తీసిన పరిస్థితులు వంటి అంశాలను నడిపిన విధానం ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం అందరికీ రివీల్ అయిపోయినా ఆసక్తికరంగా, కొత్తగానే అనిపిస్తాయి.

రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక్కో పాత్రను ప్రాణం పెట్టి మరీ బలంగా రూపొందించారు. అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, దేవసేన, బిజ్జలదేవుడు, శివగామి వంటి క్యారెక్టర్స్ దేనికదే ప్రత్యేకం.

 

ఇక స్క్రీన్ మీద ప్రభాస్, అనుష్కల కెమిస్ట్రీ చాలా అందంగా పండింది. రాజమౌళి వీరిద్దరి ట్రాక్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు కథనంలోని భీభత్సం రసం మనల్ని ఉత్కంఠకు గురిచేస్తున్నా కూడా ప్రభాస్, అనుష్కలు కలిసి కనిపించే ప్రతి సీన్ ప్రేమతో నిండి రొమాంటిక్ గానో, అన్యోన్యతతో ఉండి అందంగానో, బాధతో కూడి ఉద్వేగంగానో ఫీలయ్యేలా చేసింది. ఇక నటీనటుల నటన విషయానికొస్తే ఒక్కొరి గురించి కాస్త వివరంగా చెప్పుకోవాల్సిందే.

మైనస్ పాయింట్స్:
ఈ అద్భుత దృశ్య కావ్యంలో చెప్పుకోడానికి పెద్దగా పొరపాట్లేమీ లేవు. అంత జాగ్రత్తగా ప్రతి విభాగం చేత పనిచేయించాడు రాజమౌళి. అయినా కూడా సినిమాపై ఉన్న భారీ అంచనాలు కొన్ని చిన్న చిన్న పొరపాట్లని పట్టుకునేలా చేస్తాయి. అలాంటి పొరపాట్లలో ముఖ్యమైనది క్లైమాక్స్ వార్ ఎపిసోడ్. ఇందులో రానా, ప్రభాస్ ల మధ్య జరిగే పోరాటం భారీ స్థాయిలో గొప్పగానే ఉన్నా కూడా మిగిలిన సైన్యం చేసే యుద్ధం మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే యుద్దమంత భీభత్సంగా అయితే లేదు. అలాగే సినిమా చివర్లో అనుష్క పాత్రకు ఇంకాస్త ఎమోషనల్ టచ్, తమన్నా పాత్రకు కనీసం డైలాగ్స్ చెప్పే ఛాన్స్ అయినా ఇచ్చి ఉంటే ఇంకాస్త ఎక్కువ సంతృప్తికరంగా ఉండేది.

సాంకేతిక విభాగం :

ఈ విజువల్ వండర్ రూపుదిద్దుకోవడానికి దర్శక, రచయితలతో పాటు సాంకేతిక విభాగాల పనితీరు కూడా గొప్ప స్థాయిలో ఉంది. రాజమౌళి తన ఆకాశమే హద్దుగా ఉండే తన ఊహల్లో ప్రతి సన్నివేశాన్ని ఎంత గొప్పగా అయితే ఊహించుకున్నాడో అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించాడు. ఒక చారిత్రక నైపథ్యంలో ఉన్న కథకు డ్రామాతో పాటు నేటి వ్యాపార ప్రపంచంలో ముఖ్యమైన వాణిజ్య అంశాలైన హాస్యం, రొమాన్స్ వంటి వాటిని కలిపి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా తీయడమంటే మాటలు కాదు. కానీ రాజమౌళి అదే పని చేశాడు. తన ప్రధాన బలమైన హీరో యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం దగ్గర నుండి గొప్ప కథను, గొప్ప కథనంతో ఎక్కడా ఆసక్తి తగ్గడం కాదు కదా సీను సీనుకి ఉత్కంఠ ఇంకా పెరిగేలా, కళ్ళు చెదిరే దృశ్యాలతో ప్రపంచస్థాయి సినిమాను చేశాడు. సినిమాకు కీలకమైన ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లను అద్భుతంగా రూపొందించి సినిమా విజయాన్ని కత్తి దింపినట్టు ఖాయం చేసేశాడు.

విజువల్ ఎఫెక్ట్స్ :

ముందుగానే చెప్పినట్టు ఆర్. సి. కమల్ కణ్ణన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచస్థాయిలో ఉంది కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. ఇలాంటి గ్రాఫికల్ వర్క్ ను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ మనం చూడలేదు. నటీ నటులను ఎలివేట్ చేయడంలో, అద్భుతమైన మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆణువణువూ కళ్ళకు కట్టేలా చూపడంలో, పోరాట సన్నివేశాలని స్పష్టంగా చూపడంలో మంచి పనితనం కనబర్చారు విఎఫ్ఎక్స్ టీమ్. ముఖ్యంగా ‘హంస నావ’ పాటలోని విజువల్స్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి.

సంగీతం :
ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకున్నప్రధాన బలాల్లో ఒకటి. సందర్భానుసారంగా వచ్చే పాటలకు ఆయన చేసిన సంగీతం చాలా వినసొంపుగా ఉంది. ‘హంస నావ, దండాలయ్యా’ పాటల సంగీతం చాలా బాగుంది. ఇక ప్రభాస్ కనిపించే సీన్లలో బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే ‘హైస్స ముద్రస్స’ అనే పాట వినబడినప్పుడల్లా ఒళ్ళు పులకరించేలా చేసింది.

సినిమాటోగ్రఫీ:
రాజమౌళి విజన్ ను ఖచ్చితంగా అర్థం చేసుకుని దాన్ని అలానే తన కెమెరాలో బందించి తెరపై ఆవిష్కరించగల సమర్థుడు సెంథిల్ కుమార్. అందుకే వీరి కలయిక బ్రహ్మాండమైన విజయాల్ని సాధించింది. ఈ సినిమాలో కూడా సెంథిల్ కుమార్ నటీ నటుల చిత్రం దగ్గర్నుంచి పరిసరాలు, వార్ సీన్స్ వంటి వాటిని చాలా హుందాగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను బాగా క్యాప్చర్ చేశాడు.

నిర్మాతలు :
నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడింది. ఒక చిత్రాన్ని అద్భుత స్థాయిలో ప్రేక్షకులకు అందివ్వడానికి నిర్మాతలు పడే తపన ఎటువంటిదో, అన్ని విభాగాలకు బడ్జెట్ పరంగా సమాన న్యాయం చేస్తే ఫలితం ఎంత గొప్ప స్థాయిలో ఉంటుందో ఈ సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా బాగా కుదిరింది.  అలాగే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మొదటి అర్థ భాగంలో డిజైన్ చేసిన వార్ సీన్, క్లైమాక్స్ లో ప్రభాస్, రానా ల మధ్య కంపోజ్ చేసిన భీభత్సమైన పోరాటం ఆకట్టుకుంది.

చివరగా:

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం అందరి ఊహలను అందుకుంది. ఆకట్టుకునే కథ కథనాలు, వాటిని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించిన తీరు, విజువల్స్ లో మాటల్లో చెప్పలేనంత భారీతనం, నటీనటుల గొప్ప నటన, ఆకట్టుకునే ఓపెనింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఈ సినిమాలో పకట్టిపడేసే అంశాలు కాగా కాస్తంత అసంతృప్తిగా తోచిన క్లైమాక్స్ వార్ ఎపిసోడ్, తమన్నా పాత్రలు చిన్నపాటి లోటుగా కనిపించాయి. మొత్తం మీద చెప్పాలంటే రాజమౌళి సృష్టించిన ఈ అద్భుత దృశ్య కావ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడమేగాక ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి, తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి ఖ్యాతిని తెచ్చిపెడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అంతా ఒక్కటే.. డౌట్. ప్రేక్షకులంతా అనున్నట్లు కట్టప్ప బాహుబలిని చంపిన విధానం మత్రం కాస్త ఊహిందతగిందే. ఈ ప్రశ్నకు సమాధానం ఎంతో ఎగ్జయిట్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం మజా దొరకదు. అందుకేనేమో..ఈ ప్రశ్నను మాత్రమే హైలెట్ అనుకోవద్దని రాజమౌళి పదే పదే చెప్తూ వచ్చాడు. బాహుబలి1తో వచ్చిన క్రేజ్ తో ప్రేక్షకులకు హై ఎక్స్ పెక్టేషన్స్ ఉండటం సహజం.

చివరగా అన్నీ ఉన్నా బాహుబలి 1 స్థాయిలో బాహుబలి 2 లేదనేది మాత్రం వాస్తవం.

Follow Us:
Download App:
  • android
  • ios