పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ‘బేబీ’ నిర్మాత సాయం.. దాచిన డబ్బుకు చెదలు పట్టడంతో ఎస్కేఎన్ భరోసా
‘బేబీ’ మూవీ నిర్మాత ఎస్కేఎన్ ప్రస్తుతం సక్సెస్ తో దూసుకుపోతున్నారు. మరోవైపు తన వ్యక్తిత్వంతోనూ అభినందనలు పొందుతున్నారు. తాజాగా ఓ పేదింటి అమ్మాయి పెళ్లికి సాయం ప్రకటించారు.
‘బేబీ’ సినిమాతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు (SKN) మంచి ఫలితం అందుకున్నారు. రూ.90 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. చిన్న సినిమాతో మంచి ప్రాఫిట్ అందడంతో నెక్ట్స్ మరిన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ పెట్టారు. ఇలా నిర్మాతగా మంచి ఫామ్ లోనే ఉన్నారు. యంగ్ డైరెక్టర్లను తనలైన్ లోకి తీసుకొని ఇంట్రెస్టింగ్ కథలను తెరకెక్కించబోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఎస్కేఎన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన కామెంట్స్ తో ఆకట్టుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా మాత్రం తన మనస్సును చాటుకున్నారు. ఇంతకీ ఏం చేశారంటే.. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ పేద తండ్రి తన బిడ్డకోసం రూ.2 లక్షల వరకు దాచిపెట్టారు. కూడబెట్టిన సొమ్మును ఇంట్లోనే భద్రంగా ఉంచారు. కానీ కరెన్సీ మొత్తం చెదలు పట్టినట్టుగా, ఎలుకలు కొరికట్టుగా అయ్యింది. వినియోగించుకునేందుకు ఏమాత్రం అనుకూలంగా లేదు. పెళ్లి కోసం దాచిన డబ్బులు అలా నిరుపయోగం అవ్వడంతో ఆ తండ్రి విలపించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిర్మాత ఎస్కేఎన్ విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎంత డబ్బైతో ఖరాబైందో ఆ మొత్తాన్ని (రూ.2 లక్షలు) సాయం చేస్తానని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా.. డబ్బులను బ్యాంక్ ల్లో దాచుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మొత్తానికి ఎస్కేఎన్ చేసిన పనికి నెటిజన్లు అభిమానులంతా మెచ్చుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి సాయంచేయడం అతని గొప్ప మనస్సుకు నిదర్శనమంటూ అభినందిస్తున్నారు.
ఇక SKN నెక్ట్స్ నలుగురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఇచ్చిన జోష్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్, సందీప్ రాజ్. సుమన్ పాతూరి, రవి దర్శకత్వంలో ఆ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకోనున్నాయి.