మూడేళ్ళ పాటు ఎన్టీఆర్ కాల్ షీట్స్ నిర్మాతలకు దొరకడం కష్టం. ఎన్టీఆర్ అంగీకరిస్తున్న ప్రాజెక్ట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాదికి పూర్తి కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోయే దర్శకుల విషయంలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ కుమార్ లాంటి బడా దర్శకులతో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకారం చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే చిత్రం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అద్భుతమైన కథలతో మ్యాజిక్ చేస్తున్న తమిళ సంచలనం అట్లీ తెలుగులో ఓ చిత్రం చేసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. 

అట్లీ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడంటూ గతంలో ఊహాగానాలు వినిపించాయి. అయితే తన తెలుగు చిత్రం ఇప్పుడే ఉండదని అట్లీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అట్లీ విజయ్ తో బిగిల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ అట్లీకే ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. మొత్తంగా మైత్రి నిర్మాతలు బడా దర్శకులందరిని టాలీవుడ్ కు తీసుకుని వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కమిటైన సినిమాలన్నీ పూర్తి కావడానికి కనీసం మూడేళ్ళ సమయం పడుతుంది.