మలయాళీ నటి అర్చన కవి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2009లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అర్చన కవి నటనకు ప్రాధ్యానత ఉన్న చిత్రాలని ఎంచుకుంది. అర్చన కవి తెలుగులో కూడా ఓ చిత్రంలో నటించింది. 2013లో విడుదలైన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంలో అర్చన కవి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా అర్చన కవి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. 

కొచ్చిలో ఆమె ఓ కారులో విమానాశ్రయానికి ప్రయాణిస్తుండగా మెట్రో శ్లాబ్ విరిగిపడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో అర్చనకు కానీ, డ్రైవర్ కు కానీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు అద్దం దెబ్బతింది. ఈ ప్రమాదం గురించి అర్చన ట్విట్టర్ లో పేర్కొంది. 

విమానాశ్రయానికి వెళుతున్న మా కారుపై మెట్రో శ్లాబ్ విరిగిపడింది. మాకు ఎలాంటి ప్రమాదము జరగలేదు. కొచ్చి మెట్రో అధికారులు, పోలీసులు ఈ ఘటనపై విచారణ జరపాలి. కారు డ్యామేజ్ కు డ్రైవర్ కు నష్టపరిహారం అందించాలని అర్చన డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అర్చన కోరింది. దీనిపై మెట్రో అధికారులు స్పందించారు. డ్రైవర్ ని కలసి అతడికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. 

ఇలాంటి సంఘటనలు మెట్రో సేఫ్టీపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే ప్రమాదానికి గల కారణాలని తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.