యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దీనికి విశేష ప్రేక్షకాదరణ లభించింది. సీరియస్ లుక్ తో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ టీజర్ కి హైలైట్ గా నిలిచాయి.

అయితే తాజాగా చిత్రబృందం మరో టీజర్ ని విడుదల చేయబోతోందని సమాచారం. అక్టోబర్ లోనే సినిమా రిలీజ్ కి ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సినిమా ప్రమోషన్స్ కూడా జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సినిమా నుండి సెకండ్ టీజర్ విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పడంతో సినిమా నుండి మరో మాస్ టీజర్ రాబోతుందని తెలుస్తోంది.

ఈసారి టీజర్ లో సినిమాలో ముఖ్యమైన పాత్రలను పరిచయం చేయబోతున్నారట. వినాయక చవితి సందర్భంగా ఈ కొత్త టీజర్ ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.