బ్రేకింగ్: టాలీవుడ్ కి షాక్.. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ విధింపు
ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్కులు, రెస్టారెంట్స్, థియేటర్స్, మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ బలంగా మొదలైందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనితో ఏపీ ప్రభుత్వం కోవిడ్ నిబంధనల మేరకు చర్యలు ప్రారంభించింది.
తాజాగా ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్కులు, రెస్టారెంట్స్, థియేటర్స్, మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనలు జనవరి 8 నుంచి అమలులోకి రానున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. కొత్తగా తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ కి షాకిచ్చేదే. ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ తో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి.
దీనితో సంక్రాంతి బరిలోకి చాలా చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. సంక్రాంతికి సందడి చేయబోతున్న పెద్ద మూవీ నాగార్జున బంగార్రాజు మాత్రమే. తాజాగా నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యుపెన్సీ విధించడం వల్ల సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పేలా లేదు. నైట్ కర్ఫ్యూ వల్ల ఒక షోని పూర్తిగా కోల్పోవలసి ఉంటుంది. మిగిలిన మూడు ఆటలు 50 శాతం కెపాసిటితో సాగాలి.
ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతికి రాబోతున్న చిన్న చిత్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. చిన్న సినిమాల కంటే నాగార్జున బంగార్రాజుకే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాగ్ బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతికే తీసుకువస్తారా లేదా అనేది వేచి చూడాలి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలకు 50 శాతం ఆక్యుపెన్సీ పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ మీడియం, భారీ బడ్జెట్ చిత్రాలపై తప్పకుండా ప్రభావం ఉంటుంది.