బాలకృష్ణకే కాదు, చివరికి చిరంజీవికి కూడా ఝలక్‌ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. `వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి బ్రేకులు వేసింది. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి బ్రేక్‌ పడింది. ఏర్పాట్లని నిలిపి వేయాలంటూ అధికారులు వెల్లడించారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో `వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని ఈ నెల 8(ఆదివారం)న నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. స్టేజ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వహకులు. అయితే ఈవెంట్‌కి పర్మిషన్‌ లేదని చెబుతూ స్థానిక అధికారులు ఏర్పాట్లని నిలిపి వేయాలని ఆదేశించిన్నట్టు తెలుస్తుంది. 

ఆదివారం రోజు ఈవెంట్‌ ఉన్న నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ఈవెంట్‌ కావడంతో భారీ స్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది. పైగా ఆదివారం బీచ్‌కి సాధారణ ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఈవెంట్‌ అంటే ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశ్యంతో అధికారులు ఈవెంట్‌కి నో చెప్పినట్టు తెలుస్తుంది. ఈవెంట్‌ ఏర్పాటుకి ప్రభుత్వం నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీనిపై చిత్ర బృందం మరోసారి ఆలోచన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

ఈ రోజు(గురువారం) రాత్రి వరకు దీనిపై ఓ క్లారిటీ ఉంది. ఈవెంట్‌ ప్లేస్‌ని మార్చడమే, రద్దు చేయడమా? లేక అందులోనే నిర్వహించాలా? అనేది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఒంగోల్‌లో బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ కి ప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వలేదు. దీంతో ఒంగోల్‌లోనే మరో చోటుకి ఈవెంట్‌ వేదికని మార్చారు. పూర్తిగా చిత్ర బృందం బాధ్యత మీదనే ఈవెంట్‌ నిర్వహించాలని పోలీసులు తెలిపారు. 

ఇప్పుడు చిరంజీవి సినిమా ఈవెంట్‌ విషయంలోనూ అదే జరిగింది. అయితే ఏపీ సీఎం జగన్‌కి దగ్గరగా ఉండే చిరంజీవికి కూడా ఇలాంటి సమస్యనే రావడం షాక్‌కి గురి చేస్తుంది.ఏపీ ప్రభుత్వం నిర్ణయం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మరి ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా, రవితేజ ముఖ్య పాత్ర పోషించారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. చిరు, బాలయ్య చిత్రాలకు మైత్రీ మూవీ మేకర్సే నిర్మాతలు కావడం విశేషం. ఇక `వాల్తేర్‌ వీరయ్య` ఈ నెల 13న రిలీజ్‌ కాగా, `వీర సింహారెడ్డి` ఈ నెల 12న రిలీజ్‌ చేయబోతున్నారు.