K Viswanth: కే విశ్వనాథ్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
కళాతపస్వి కే విశ్వనాథ్ మరణంపై ఏపీ సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రాలు అసమాన గౌరవాన్ని తెచ్చిపెట్టాయన్న సీఎం జగన్... ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఉండిపోతారన్నారు.

దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ నింగిగేకారు. తన సినిమాలనే గొప్ప జ్ఞాపకాలను తెలుగు ప్రేక్షకలకు వదిలి వినీలాకాశంలోకి విహరించారు. కే విశ్వనాథ్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. ఆయన చిత్రాలను, పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విశ్వనాథ్ మరణంపై స్పందించారు. ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
'విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు'... అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. విశ్వనాథ్ గారి ఔన్నత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
వివిధ పరిశ్రమలకు చెందిన చిత్ర ప్రముఖులు, అభిమానులు విశ్వనాథ్ మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ సంతాపం ప్రకటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహమాన్ విశ్వనాథ్ మృతిపై స్పందించారు. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అన్నారు. కళలు, భావోద్వేగాలు, ప్రేమ, అనురాగం అన్ని పార్శ్వాలతో కూడిన అద్భుతాలు కే విశ్వనాథ్ చిత్రాలని కొనియాడారు.
92 ఏళ్ల విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా విశ్వనాథ్ వయో సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో ఆయన్ని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటూ అక్కడే ఆయన కన్నుమూశారు. అర్ధరాత్రి వేళ అందిన విశ్వనాథ్ మరణ వార్త అందరినీ పిడుగుపాటుకు గురిచేసింది.