లాక్‌డౌన్‌ సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌డౌన్‌తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఎట్రాక్టివ్ ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సం​స్థలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు చిన్న సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై విడుదల అయ్యాయి. అయితే తాజాగా ఓ సంస్థ నిశ్శబ్దం సినిమాతో డీల్‌ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డీల్ చాలా కాలం జరిగి ఆగింది. రీసెంట్ గా ఈ డీల్ క్లోజ్ చేసేందుకు ఓ సంస్ద ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు సిద్దపడుతోందిట. ఆ మేరకు ఫైనల్ టాక్స్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే నిశ్శబ్దం విషయంలో ఎందుకు అంతలా ఓటీటిలు పట్టుపడుతున్నాయి. రేటు ఎక్కువ చెప్తున్నా ..ఆసక్తి చూపిస్తున్నాయి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు...ఓటీటి సంస్దలు...'నిశ్శబ్ధం' సినిమాతో పెద్ద సినిమాలను డైరక్ట్ ఓటీటిల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరో ఒకరు ప్రారంభిస్తే ..మంచి రేటు వస్తుందని మిగతా వాళ్లు సైతం ఉత్సాహం చూపిస్తారు. ఏ పెద్ద సినిమా ఓటీటిలోకి రాకపోతే మిగతా నిర్మాతలు ఎవరూ ముందుకు రారు. కాబట్టి 'నిశ్శబ్ధం' ని చూపించి మిగతా సినిమాలకు గాలం వేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా 'నిశ్శబ్ధం' సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అవి కూడా ప్లస్ అవుతాయని తమ ఓటీటి పాపులారిటీకి భావిస్తున్నారు. 

అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఏప్రియల్ 2 వ తేదీన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు.  కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్‌ పొడగింపు, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శక, నిర్మాతలు ఈ సినిమాని ఓటీటికు ఇచ్చేద్దామనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న 'నిశ్శబ్దం'లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం.   మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని కీ సీన్స్ ను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేసారు. ఈ సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గింది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్.