బాహుబలి2 చిత్రం తర్వాత అందాల తార అనుష్క శెట్టి నటిస్తున్న సినిమా భాగమతి. అత్యున్నత సాంకేతిక విలువలతో విభిన్నమై కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి పిల్ల జమీందార్ లాంటి హిట్ అందించిన దర్శకుడు జి అశోక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 26న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంథూ రివ్యూ ఇచ్చేశాడు.

 

ఈ సినిమా కథ దెయ్యాల కథ, పునర్జన్మ స్టోరీతో కాకుండా సమకాలీన అంశాలతో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం భాగమతి. అనుష్క శెట్టి సంజనా అనే ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. కల్పిత పాత్రలతో భాగమతిని రూపొందించారు. భాగమతి చిత్రాన్ని 4కే హై డెఫినేషన్ ఫార్మాట్‌లో తెరకెక్కించారు. ఓ తెలుగు సినిమాను ఈ సాంకేతికత రూపొందించడం ఇదే తొలిసారి.

 

మరోవైపు భాగమతి చిత్రంలో తనది ద్విపాత్రాభినయం అని వస్తున్న వార్తలను హీరోయిన్ అనుష్క తోసిపుచ్చింది. తన క్యారెక్టర్‌లో ఊహించిన విధంగా వేరియేషన్స్ ఉంటాయి. అభినయానికి ఎంతో స్కోప్ ఉన్న పాత్ర అని అనుష్క వివరించింది. ఈ చిత్రంలో అనుష్కతోపాటు ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా సారథ్ నటించారు.

 

థియేటర్లలో ప్రతిష్ఠాత్మక సినిమాలు బరిలో లేకపోవడం భాగమతి చిత్రానికి కలిసి వచ్చే అంశం. థియేటర్లలో మంచి చిత్రాలు లేని కారణంగా భాగమతిని ప్రేక్షకులు ఆదరించడానికి పుష్కలంగా అవకాశం ఉంది. ఫస్ట్‌ లుక్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సీట్లో బిక్కు బిక్కు మంటూ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసే చిత్రం భాగమతి. ఆడియెన్స్ సీట్లో కూర్చొని వణికిపోతారు. అత్యున్నత సాంకేతిక విలువలతో వస్తున్న చిత్రమిది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు తెరకెక్కని చిత్రం. నా రేటింగ్ ఈ సినిమాకు 4/5 అని ప్రముఖ క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

 

భాగమతి చిత్రంలో అనుష్కది పూర్తిగా వన్‌ ఉమన్ షో. పాత్ర కనుగుణంగా మారిపోయి అద్బుతమైన అభినయాన్ని పండించింది. చిత్రంలో సన్నివేశాలు కళ్లకు కట్టినట్టుగా ఉన్నాయి. అనుష్క కెరీర్‌లో మరుపరాని చిత్రంగా భాగమతి నిలిచిపోతుంది.

 

బాహుబలి తర్వాత అనుష్క మంచి ఫామ్‌లో ఉంది. భాగమతిగా తన ప్రతాపాన్ని తెర మీద చూపించేందుకు సిద్ధమైంది. అరుంధతి, దేవసేన, రాణి రుద్రమదేవి పాత్రలకు ధీటుగా భాగమతి పాత్ర రూపకల్పన చేసినట్టు సినీవర్గాల్లో టాక్. టాలీవుడ్‌ ప్రేక్షకులకు చక్కని అనుభూతిని కలిగించే చిత్రమవుతుందనే విశ్వాసం వ్యక్తమవుతున్నది. విజువల్స్, సంగీతం సినిమాటోగ్రాఫర్ ఆర్ మాధీ తెరకెక్కించిన విజువల్స్, ఎస్.ఎస్.థమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భాగమతికి అదనపు ఆకర్షణగా మారాయని చెప్పుకొంటున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.