బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు పూర్తిగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ రియా మెడకు చుట్టుకుంది. ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రియా, సుశాంత్‌కు మాధక ద్రవ్యాలు ఇచ్చేదదన్న ఆరోపణలు కూడా రావటంతో నార్కోటిక్స్‌ బ్యూరో విచారణ చేపట్టింది.

ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి నార్కోటిక్స్‌ టీం రియా చక్రవర్తితో పాటు సుశాంత్ సహాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎన్‌సీబీ టీం అరెస్ట్ చేసిన జైద్ విలట్రాకు రియా సోదరుడు షోవిక్‌కు సంబంధాలు ఉన్నట్టుగా నార్కోటిక్స్ టీం గుర్తించింది. మరోవైపు సుశాంత్ సహాయకుడు సామ్యూల్‌ మిరండా ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. షోవిక్‌తో పాటు సామ్యూల్‌కి కూడా జైద్‌ డ్రగ్స్‌ సప్లయ్‌ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రోజు ఉదయం 6:40 సమయంలో సోదాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా మాట్లాడుతూ తాను జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని చెప్పింది. అంతేకాదు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని ఆయన్ను కూడా ఆపేందుకు చాలా ప్రయత్నించానని చెప్పింది. 34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.