తీగ లాగితే డొంక కదిలినట్టు బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో కొత్త విషయంలో బయటకొస్తూ సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఓ జాతీయ ఛానెల్‌ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌లో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సుశాంత్‌ చనిపోయిన రాత్రి ఏం జరిగిందనేది ఇప్పుడు ఉత్కంఠకు గురి చేస్తుంది. 

జాతీయ ఛానెల్‌ రిపబ్లిక్‌ టీవీ సేకరించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇందులో సుశాంత్‌ శవమై ఉన్న చోట నల్ల టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో నల్లని బ్యాగ్‌ కనిపిస్తుంది. అసలు అతను ఎవరు? అక్కడ ఎందుకున్నాడు. అతని చేతిలో ఉన్న బ్యాగ్‌లో ఏముందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే అతను సుశాంత్‌ హౌజ్‌ మేనేజర్‌ శ్రావణ్‌ అని ప్రాథమిక సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు సుశాంత్‌ నివసించే అపార్ట్ మెంట్‌లోకి ఓ లేడీ వచ్చింది. గుర్తుతెలియని విధంగా ఉన్న ఆమె ఎవరు? ఎందుకొచ్చింది. ఆమెకి, సుశాంత్‌ మరణానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె తన ప్రియురాలై ఉంటుందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలా అనేక అనుమానాలకు సుశాంత్‌ కేసు తావిస్తోంది. 

ప్రస్తుతం ముంబయి పోలీసులు, బీహార్‌ పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. ముంబయి పోలీసులపై పలు ఆరోపణలు ఉన్నాయి. కేసులో కొన్ని విషయాలను దాస్తున్నారని, కీలక సమాచారన్ని పక్కన పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని సుశాంత్‌ తండ్రి కేకేసింగ్‌ కోరిక మేరకు కేంద్రం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. వాళ్ళు విచారణ చేపట్టాల్సి ఉంది. మరోవైపు మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగి రియా కుటుంబ సభ్యులను, పలువురుని విచారించారు.