డైరెక్టర్ శివ పేరు చెప్పగానే అజిత్ నటించిన వివేగం, వేదలమ్, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు గుర్తుకొస్తాయి. మాస్ కథలని స్టైలిష్ గా తెరకెక్కించడంలో శివ సిద్ధహస్తుడు. వరుసగా అజిత్ తో చిత్రాలు చేస్తూ వచ్చిన శివ ఎట్టకేలకు హీరోని మార్చాడు. విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న సూర్య 39వ చిత్రం శివ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. 

విశ్వాసం చిత్రానికి సంగీతం అందించిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందించబోతున్నాడు. వెట్రి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. మిలాన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. 

స్టూడియో గ్రీన్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. శివ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రకటన చేసింది. శివ ఈ చిత్రాన్ని ఎలాంటి కథతో రూపొందించబోతున్నాడు.. హీరోయిన్ ఎవరు తదితర అంశాలన్నీ త్వరలో తెలియనున్నాయి. 

ప్రస్తుతం సూర్య కప్పాన్(తెలుగులో బందోబస్త్) చిత్రంలో నటిస్తున్నాడు. కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రం ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సింది. కానీ ప్రభాస్ సలహా రిలీజ్ అవుతుండడంతో సెప్టెంబర్ కు వాయిదా వేశారు.